Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం సవాళ్లు, ప్రతిసవాళ్లలో వేడెక్కింది. మరోసారి అయోధ్య హాట్ టాపిక్‌గా మారింది. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. అయోధ్యలో పోటీకి బీజేపీకి అభ్యర్థి కూడా దొరకడొం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే అయోధ్య నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు.
అయోధ్యలో రెండు రోజుల పర్యటనలో భాగంగా భాగవత కథ కార్యక్రమంలో అఖిలేష్ పాల్గొన్నారు. ‘‘మీకు అంత నమ్మకం ఉంటే, మంచి-చెడు తేల్చాలనుకుంటే ముఖ్యమంత్రి స్వయంగా అయోధ్య నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలి. ఈసారి అయోధ్య ప్రజలే మంచి-చెడు ఏదో తేల్చుతారు’’ అని అన్నారు. అధికారం, కులం, హెచ్చుతగ్గులు, అంటరానితనం వంటి వాటి నుంచి బయటపడాలని భాగవతం బోధిస్తుందని అన్నారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడిని ప్రస్తావిస్తూ.. ప్రేమే పరమార్థమని, పరిపాలనకు మానవత్వం ప్రాథమిక షరతు అని అన్నారు.
2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా బీజేపీని ఓడించి అధికారిన్ని చేజిక్కించుకోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో ఎస్పీ తన అభ్యర్థిగా తేజ్ నారాయణ్ పాండేను ప్రకటించింది. ఎస్పీ అధికారంలోకి వస్తే మహిళలకు ఏటా రూ. 40 వేల ఆర్థిక సాయం అందిస్తామని, దుకాణాలు, ఇళ్ల కూల్చివేత ఉండబోదని హామీ ఇచ్చారు. అయోధ్యకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తామని అన్నారు.

