ఎన్నికలు వస్తే చాలు రాజకీయ పార్టీలు ప్రజలపై ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలన్నీ హామీలిచ్చే పనిలో పడ్డాయి. తాజాగా యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కొత్త హామీని ప్రకటించింది. మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు ఉచిత రేషన్‌తో పాటు పేదలకు కిలో నెయ్యి ఇస్తామని ప్రకటించారు. పేదల ఆరోగ్యం మెరుగుపడేందుకు నెయ్యిని అందజేస్తామని వివరణ ఇచ్చారు.
అంతేకాదు బీజేపీ ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకుందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఎన్నికలు వరకు మాత్రమే రేషన్ సరుకులు అందుతాయని, తర్వాత దానిని రద్దు చేస్తారని ఆయన విమర్శించారు. అందుకే ఉచిత రేషన్‌కు ఇటీవల బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని గుర్తుచేశారు. కాగా అఖిలేష్ యాదవ్ ఇప్పటికే ప్రజలకు అనేక హామీలను ప్రకటించారు. యువతకు ఐటీ రంగంలో 22 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని, అతి తక్కువ డబ్బులకు పేదలకు పోషకాహారం అందించేందుకు క్యాంటీన్లు పెడతామంటూ వరాలు కురిపించారు.
