DGCA: పొగమంచు, వాతావరణ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా విమానయాన కార్యకలాపాలపై దెబ్బ పడింది. ముఖ్యంగా ఢిల్లీలో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టు, విమానాల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆలస్యం వల్ల పలువురు ప్రయాణికులు అసహనంతో ఎయిర్ లైనర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. విమానాల ఆలస్యం, రద్దుకు సంబంధించి వరస ఫిర్యాదుల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) సోమవారం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPలు) జారీ చేసింది.
విమానయాన సంస్థలు ప్రయాణికులకు రక్షణ కల్పించాలని డీజీసీఏ ఆదేశించింది. విమానాల రద్దు, విమానాల ఆలస్యంగా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని చెప్పింది. కొత్త మార్గదర్శకాలలో భాగంగా, విమాన టిక్కెట్లపై పౌర విమానయాన అవసరాల (CAR) సూచనను చేర్చాలని ఎయిర్ లైనర్లకు సూచించింది.
Read Also: Tamil Movies: ‘కెప్టెన్ మిల్లర్’ను డామినేట్ చేస్తున్న అయలాన్
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 3 గంటల వ్యవధికి మించి ఆలస్యమైతే విమానాలు రద్దు చేయాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయాల్లో రద్దీని నివారించడం, ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. ఇటీవల పొగమంచు కారణంగా ఫ్లైట్స్ ఆలస్యం కావడం, ఇతర ప్రాంతాలకు మళ్లించడం వల్ల ప్రయాణికులు ఫ్లైట్ సిబ్బందిపై దాడులు చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ ఎస్ఓపీలను డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.