Air India Flight: ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం గాలిలోనే తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంది. ఏకంగా విమానం 300 అడుగులకు పడిపోయింది. ఈ ఎయిర్ ఇండియా విమానం AI2379 ప్రమాదంపై దర్యాప్తు మరింత వేగవంతమైంది. విమానం ఢిల్లీలో ల్యాండైన తర్వాత రూపొందించిన మెయింటనెన్స్ రిపోర్టులో స్వల్ప వ్యవధిలోనే 3 హైడ్రాలిక్ ప్రెజర్ అలర్ట్స్ నమోదైనట్లు తెలుస్తోంది. ఎయిర్ బస్ A320 (VT-EXO) విమానంలో గ్రీన్, ఎల్లో, బ్లూ హైడ్రాలిక్ వ్యవస్థల్లో లో-ప్రెజర్ హెచ్చరికలు నమోదయ్యాయి. వీటి తర్వాత కొద్దిసేపటికే ‘‘ఆటోపైలట్’’ డిస్‌కనెక్ట్ అయినట్లు రికార్డుల్లో నమోదైంది. విమానంలో మరోసారి ఆటోపైలట్ వార్నింగ్ నమోదైంది. దీనిని బట్టి చూస్తే మొదట డిస్‌కనెక్ట్ తర్వాత, ఆటోపైలట్ తిరిగి యాక్టివేట్ అయి, మళ్లీ డిస్ఎంగేజ్ అయి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
టర్బులెన్స్‌తో సంబంధం ఉందా..?
ఆగస్టు 4న జరిగిన ఈ ప్రమాదానికి తీవ్రమైన టర్బులెన్స్‌తో సుమారు 300 అడుగుల మేర అకస్మాత్తుగా కిందకు దిగింది. ఈ టర్బులెన్స్ ఘటనకు హైడ్రాలిక్ వార్నింగ్స్, ఆటోపైలట్ డిస్‌కనెక్ట్, ఇతర సిస్టమ్స్ సందేశాలకు ఏదైనా సంబంధం ఉందనా అని అధికారులు పరిశీలిస్తున్నారు. మెయింటనెన్స్ రిపోర్టులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు, ఇతర విమాన వ్యవస్థలకు సంబంధించిన హెచ్చరికలు కూడా నమోదైనట్లు సమాచారం. ఈ మెయింటెనెన్స్ రికార్డును డీజీసీఏ (DGCA), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)కు అందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
హడలిపోయిన ప్రయాణికులు..
ప్రమాదం సమయంలో విమానంలో 137 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ముగ్గురు శిశువులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. టర్బులెన్స్ ఘటనలో 20 మంది ప్రయాణికులు, నలుగురు క్యాబిన్ సిబ్బంది గాయపడ్డారు. ఒక్కసారిగా విమానం 300 అడుగులు దిగడంతో ప్రయాణికుల్లో కొందరికి మెడ, వెన్నెముకకు గాయాలయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. తొలి హైడ్రాలిక్ వార్నింగ్ వచ్చిన తర్వాత విమానం 1గంట 20 నిమిషాలు ప్రయాణించి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
పైలట్ డ్రగ్ టెస్ట్‌పై విచారణ..
ఈ ఘటన తర్వాత విమాన కమాండర్‌కు నిర్వహించిన కన్ఫర్మేషన్ ల్యాబోరేటరీ టెస్టుల్లో గంజాయి తీసుకున్నట్లు తేలిందని సమాచారం. ఇద్దరు పైలట్లకు తప్పనిసరిగా సైకోయాక్టివ్ సబ్‌స్టెన్స్ పరీక్షలు నిర్వహించగా, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇద్దరిని ఫ్లయింగ్ డ్యూటీ నుంచి తప్పించారు. అయితే, ఈ ఘటనకు పైలట్ల తప్పిదమే కారణమని ఇప్పటి వరకు స్పష్టంగా తేలలేదు.

