గతేడాది జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై లోక్‌సభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎయిరిండియా AI-171 విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు తుది దశకు చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమైన ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లాకింగ్ వ్యవస్థలో ఎలాంటి అసాధారణతలు గుర్తించలేదని తెలిపింది. విమాన తయారీ సంస్థ నిర్వహించిన అధునాతన పరీక్షల్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లో ఎలాంటి లోపం కనిపించలేదని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.
గత ఏడాది జరిగిన AI-171 విమాన ప్రమాదంలో విమానంలోని 260 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే హాస్టల్‌లో ఉన్న మెడికోలు కూడా చనిపోయారు. ఈ ఘటనపై విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ (AAIB) దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రస్తుతం పూర్తి థ్రస్ట్ కంట్రోల్ మాడ్యూల్‌ను అమెరికాలోని సియాటిల్‌లో విమాన తయారీ సంస్థ కేంద్రంలో పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. AI-171 ప్రమాదానికి సంబంధించిన తుది దర్యాప్తు నివేదిక విడుదల ఆలస్యం కాలేదని స్పష్టం చేసింది. భారీ విమాన ప్రమాదాలపై దర్యాప్తుకు నిర్దిష్ట కాలపరిమితి ఉండదని, దర్యాప్తు ప్రక్రియలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తుంటాయని పేర్కొంది. ప్రస్తుతం AI-171 దర్యాప్తు తుది దశలో ఉందని తెలిపింది.
ఇక రాజ్యసభలో ఈ అంశంపై స్పందించిన కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్.. విమాన రకం ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రౌండ్ చేయబడిన తర్వాత.. నిరంతర విమాన భద్రతా తనిఖీల్లో భాగంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరీక్షలకు ఆదేశించిందని తెలిపారు. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌ను సమగ్రంగా పరిశీలించినట్లు చెప్పారు. స్విచ్ లాకింగ్ డిటెంట్ల నిర్మాణ బలాన్ని కూడా పరీక్షించగా ఎలాంటి అసాధారణతలు గుర్తించలేదని వెల్లడించారు. ‘‘విమాన తయారీ సంస్థ కేంద్రంలో పూర్తి థ్రస్ట్ కంట్రోల్ మాడ్యూల్‌పై పరిశీలన కొనసాగుతోంది’’ అని మురళీధర్ మొహోల్ తెలిపారు. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లో ఇప్పటివరకు ఎలాంటి సాంకేతిక లోపం బయటపడకపోయినప్పటికీ.. పూర్తి థ్రస్ట్ కంట్రోల్ మాడ్యూల్ పరిశీలన ఇంకా కొనసాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరీక్షల ఫలితాల కోసం దర్యాప్తు అధికారులు ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.
ప్రమాదంపై తుది నివేదికను AAIB ఆలస్యం చేస్తోందన్న ఆరోపణలను కూడా కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. పెద్ద విమాన ప్రమాదాల దర్యాప్తు నిర్దిష్ట గడువులో పూర్తయ్యే ప్రక్రియ కాదని, అంతర్జాతీయంగా అమలులో ఉన్న దర్యాప్తు విధానాల ప్రకారమే విచారణ కొనసాగుతోందని పేర్కొంది. ఈ ప్రమాదానికి దారితీసిన అన్ని సంభావ్య కారణాలు, దోహదపడిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని రాజ్యసభకు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ప్రమాదానికి సంబంధించిన అన్ని అంశాలు, తుది నిర్ధారణలతో కూడిన నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తుది నివేదికను అధికారికంగా విడుదల చేసిన అనంతరం AAIB వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేస్తామని తెలిపింది.

