Indian Air Force: ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) కీలకమైన విన్యాసాన్ని నిర్వహించింది. 15 కిలోమీటర్ల ఎత్తుకు పైన ప్రయాణిస్తున్న చైనా గూఢచారి బెలూన్ లాంటి లక్ష్యాన్ని విజయవంతంగా కూల్చేసింది. ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఈ ఎక్సర్‌సైజ్‌ని కొన్ని నెలల క్రితం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో రాఫెల్ ఫైటర్ జెట్స్ పాల్గొన్నాయి. ఇది పూర్తిగా కంట్రోల్డ్ ఆపరేషన్. ఈ ఆపరేషన్‌లో అత్యంత ఎత్తైన టార్గెట్లను ఛేదించే సామర్థ్యాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరీక్షించుకుంది.
2023 ప్రారంభంలో చైనాకు చెందిన ఒక గూఢచర్య బెలూన్ యూఎస్ఏ మీదుగా ప్రయాణించింది. అయితే, ఆ సమయంలో అమెరికా కూల్చేసిన బెలూన్‌తో పోలిస్తే తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూల్చేసిన టార్గెట్ చాలా చిన్నది. ఈ బెలూన్‌కి బరువును జోడించి విడుదల చేశారు. ఇది 55,000 అడుగుల ఎత్తుకి చేరగానే, క్షిపణిని ప్రయోగించి కూల్చేసినట్లు ఎయిర్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి. 15 కి.మీ ఎత్తుకు చేరుకోగానే బెలూన్‌ని న్యూట్రలైజ్ చేశారు. ఇది వాయుమార్గాన వచ్చే బెదిరింపుల్ని అడ్డుకునేందుకు వైమానిక దళం ఈ ఆపరేషన్ నిర్వహించింది
Read Also: IND vs BAN: భారత్ ముందు స్వల్ప లక్ష్యం.. అదరగొట్టిన టీమిండియా బౌలర్లు
ఇలా చాలా ఎత్తులో చైనాకు చెందిన నిఘా బెలూన్లు ప్రయాణిస్తూ.. వివిధ దేశాలపై నిఘా కార్యక్రమాలు పెంచుతున్న నేపథ్యంలో ఈ ఎక్సర్‌సైజ్ జరిగింది. 2023 ప్రారంభంలో యూఎస్ మీదుగా చైనా స్పై బెలూన్ ప్రయాణించింది. చాలా రోజుల పాటు ఉత్తర అమెరికా వ్యాప్తంగా ఇది నిఘా కార్యకలాపాలను నిర్వహించింది. దీనిని ఎఫ్-22 ఫైటర్ జెట్ల ద్వారా దక్షిణ కెరోలిన తీరంలో కూల్చేశారు.
గతంలో భారతదేశంలో కూడా ఈ తరహా బెలూన్లు కనిపించినట్లు , అండమాన్ నికోబార్ దీవులపై ఇలాంటి బెలూన్లు సంచరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ సందర్భంలో ఎలాంటి చర్యలు తీసుకోనప్పటికీ.. మూడు నాలుగు రోజుల తర్వాత బెలూన్ భారత గగనతలం నుంచి దూరంగా వెళ్లిపోయింది. నిపుణుల ప్రకారం.. ఈ బెలూన్లకు కొన్ని రకాల స్టీరింగ్ మెకానిజం అమర్చబడి ఉందని, అవి ఎక్కువ కాలం ఒకే ప్రాంతంలో సంచరించడానికి వీలు కల్పిస్తాయని చెప్పారు.