Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాకి చెందిన 24 ఏళ్ల యువకుడిని భూ వివాదంలో నలుగురు వ్యక్తులు సజీవంగా పూడ్చిపెట్టిన తర్వాత తనను వీధి కుక్కలు రక్షించాయని చెప్పాడు. తాను ఉన్న ప్రాంతాన్ని కుక్కలు తవ్వడంతో బయటపడ్డానని ఓ వ్యక్తి విచిత్రమైన వాదన చేశారు. జూలై 18న, ఆగ్రాలోని అర్టోని ప్రాంతంలో అంకిత్, గౌరవ్, కరణ్ మరియు ఆకాష్ అనే నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని రూప్ కిషోర్ అలియాస్ హ్యపీ అనే వ్యక్తి ఆరోపించారు.
Read Also: PM Narendra Modi: మోడీ పాపులారిటీకి ఎదురులేదు.. గ్లోబల్ లీడర్స్ జాబితాలో ఫస్ట్ ప్లేస్..
ఎఫ్ఐఆర్ ప్రకారం.. నలుగురు వ్యక్తులు తనను గొంతు నులిమి దాడి చేశారని చెప్పాడు. తాను చనిపోయానని భావించిన వ్యక్తులు తనను గొయ్య తవ్వి పాతిపెట్టినట్లు బాధితుడు వెల్లడించారు. అయితే, అతడిని పూడ్చిపెట్టిన ప్రదేశంలో వీధికుక్కుల గుంపు తవ్వడంతో, తనని కొరకడంతో స్పృహలోకి వచ్చినట్లు రూప్ కిషోర్ వెల్లడించాడు. కొంత మంది స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడినట్లు చెప్పాడు. ప్రస్తుతం అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. తన కొడుకును నలుగురు దుండగులు తమ ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారని రూప్ కిషోర్ తల్లి ఆరోపించింది. ఈ కేసులో క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నామని, ప్రస్తుతం అరెస్టు నుండి తప్పించుకుంటున్న నలుగురు నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.