Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..

  • భారత అణ్వాయుధ సత్తా మరోసారి నిరూపితం..
  • అగ్ని-4 క్షిపణి పరిధిలోకి మొత్తం పాకిస్తాన్..
  • చైనాలోని బీజింగ్, షాంఘై కూడా..
Agni 4

Agni 4

Agni-4: భారత అణ్వాయుధ నిరోధక సామర్థ్యం మరింత బలోపేమైంది. గురువారం అగ్ని-4 మధ్యశ్రేణి బాలిస్టిక్ మిస్సైట్ పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్ సమీపంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి విజయవంతంగా నిర్వహించిన యూజర్ ట్రయల్‌తో ఈ క్షిపణి సామర్థ్యాలు మరోసారి నిరూపితమయ్యాయి. అగ్ని సిరీజ్ మిస్సైళ్లలో అగ్ని 4 కూడా ఒకటి. అగ్ని-2, అగ్ని-3, అగ్ని-5 క్షిపణులు కూడా ఉన్నాయి.

దీని రేంజ్ 3500-4000 కిలోమీటర్లు. అగ్ని-4 పరిధిలోకి మొత్తం పాకిస్తాన్ వస్తుంది. పాకిస్తాన్ కీలకమైన నగరాలైన ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, రావల్పిండి అన్నీ కూడా దీని పరిధిలోనే ఉన్నాయి. ఇదే కాకుండా చైనాలోని మెజారిటీ ప్రాంతాలు కూడా అగ్ని-4 రేంజ్‌లోకి వస్తున్నాయి. చైనా రాజధాని బీజింగ్‌తో పాటు అతిపెద్ద నగరమైన షాంఘై కూడా ఇందులో ఉంది.

ఘన ఇంధన, వేగవంతమైన మోహరింపు:

అగ్ని-4 రెండు దశల ఘన ఇంధన వ్యవస్థలతో పనిచేస్తుంది. ఘన ఇంధన ఉపయోగించడం వల్ల క్షిపణి ఎక్కువ కాలం సిద్ధంగా ఉంటుంది. అవసరమైనప్పుడు తక్కువ సమయంలోనే లాంచ్ చేయవచ్చు. ఈ క్షిపణిని రోడ్-మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించవచ్చు. దీంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా తరలించే అవకాశం ఉంటుంది. దీంతో శత్రవులు అగ్ని-4 వ్యవస్థపై దాడి చేయడం కష్టంగా మారుతుంది.

అగ్ని-4 ప్రత్యేకతలు ఇవే:

*పరిధి: 3,500-4,000 కి.మీ.
*రకం: మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి (IRBM)
*పొడవు: 20 మీటర్లు
*ప్రయోగ బరువు: 17 టన్నులు
*పేలోడ్ సామర్థ్యం: 800-1,000 కిలోలు
*వార్‌హెడ్: అణు లేదా సంప్రదాయ పేలోడ్ మోయగలదు
*గరిష్ఠ వేగం: సుమారు గంటకు 18,500 కి.మీ.
*ఖచ్చితత్వం (CEP): 100 మీటర్లలోపు
*తయారీ: డీఆర్‌డీఓ అభివృద్ధి, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తయారీ