Sharmistha Panoli Arrest: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని షర్మిష్ట పనోలి అరెస్ట్‌పై బీజేపీ సహా ఎన్డీయే నేతలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో శర్మిష్ట పోస్ట్ చేసిన వీడియో మతపరమైన మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని చెబుతూ, బెంగాల్ పోలీసులు శుక్రవారం ఆమెను గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం జరిపిన దాడులపై కొంతమంది బాలీవుడ్ నటులు మౌనంగా ఉన్నారని ఆమె విమర్శిస్తూ వీడియో చేశారు. అయితే, కొంతమంది ఈ వీడియోపై అభ్యంతరం తెలపడంతో, దానిని డిలీట్ చేసి, క్షమాపణలు కూడా చెప్పారు.
అయితే, ఆమెకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు. పవన్ తర్వాత బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ కూడా ఆమెకు మద్దతు ఇచ్చి, వెంటనే ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘‘శర్మిష్ట తన వ్యక్తీకరణ కోసం కొన్ని అసహ్యకరమైన పదాలను ఉపయోగించారని నేను అంగీకరిస్తున్నాను, కానీ ఈ రోజుల్లో చాలా మంది యువకులు అలాంటి పదాలను ఉపయోగిస్తున్నారు. ఆమె తన ప్రకటనలకు క్షమాపణలు చెప్పింది, అది చాలు, ఆమెను మరింత బెదిరించడం, వేధించడం అవసరం లేదు. ఆమెను వెంటనే విడుదల చేయాలి’’ అని అన్నారు. ‘‘పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఉత్తర కొరియాగా మార్చవద్దని నేను కోరుతున్నారు. అందరికీ ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి.’’ అని కంగనా అన్నారు.
Read Also: Ali : కమెడియన్ అలీకి చిరంజీవి స్పెషల్ గిఫ్ట్..
కంగనాకు ముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. సనాతన ధర్మం గురించి మమతా చేసిన వ్యాఖ్యల్ని ఎత్తిచూపారు. “విభజన రాజకీయాల ద్వారా మత అల్లర్లను రెచ్చగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని , దాని “మురికి ధర్మం” హిందూ మత సూత్రాలకు విరుద్ధమని మమతా బెనర్జీ అన్నారు.
అయితే, ఈ వీడియోని పవన్ కళ్యాణ్ షేర్ చేస్తూ.. ‘‘పశ్చిమ బెంగాల్ పోలీసులు శర్మిష్టపై వేగంగా చర్య తీసుకున్నారు. కానీ ఎన్నికైన నాయకులు, టీఎంసీ ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు లక్షలాది మందికి కలిగిన తీవ్రమైన బాధ సంగతి ఏంటి? మన విశ్వాసాన్ని ‘గంధ ధర్మం’ అని పిలిచినప్పుడు ఆగ్రహావేశాలు ఎక్కడ ఉన్నాయి? వారి క్షమాపణ ఎక్కడ? వారి అరెస్టు ఎక్కడ?’’ అని ప్రశ్నించారు.
