NTV Telugu Site icon

Yogi Adityanath: “హోలీ వర్సెస్ శుక్రవారం నమాజ్”.. పోలీస్ అధికారికి యోగి మద్దతు..

Yogi Adityanath

Yogi Adityanath

Yogi Adityanath: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పోలీస్ అధికారి హోలీ, శుక్రవారం నమాజ్ గురించి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. అయితే, ఆ పోలీస్ అధికారికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మద్దతుగా నిలిచారు. అధికారి వ్యాఖ్యల్ని సీఎం యోగి సమర్థించారు. ‘‘హోలీ ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది. కానీ శుక్రవారం నమాజ్ ప్రతీ వారం ఉంటుంది. ఒక వ్యక్తి మసీదుకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఒకవేళ వెళ్లాల్సి వస్తే అతడికి రంగులతో సమస్య ఉండకూడదు’’ అని సంభాల్ సర్కిల్ ఆఫీసర్ అనూజ్ చౌదరి అన్నారు.

ఈ వ్యాఖ్యల చుట్టూ వివాదం చెలరేగింది. గురువారం, సంభాల్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో జరిగిన శాంతి కమిటీ సమావేశం తర్వాత చౌదరి విలేకరులతో మాట్లాడుతూ హోలీలో పాల్గొనడానికి ఇష్టపడని వారు ఇంటి లోపలే ఉండాలని సూచించారు. ‘‘హోలీ అనేది ఏడాదికి ఒకసారి వస్తుంది, అయితే శుక్రవారం నమాజ్ ఏడాదికి 52 సార్లు జరుగుతాయి. హోలీ రంగులతో ఎవరైనా అసౌకర్యంగా భావిస్తే, ఆ రోజు వారు ఇంటి లోపలే ఉండాలి. బయటకు వచ్చే వారికి విశాల దృక్పథం ఉండాలి’’ అని ఆయన అన్నారు.

Read Also: Alawites: అలవైట్లు ఎవరు..? సిరియాలో ఎందుకు వీరిని వేటాడి చంపుతున్నారు..

పోలీస్ అధికారి వ్యాఖ్యలపై ఇండియా టుడే నిర్వహించిన కార్యక్రమంలో సీఎం యోగి స్పందించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత నమాజ్ నిర్వహించడానికి అంగీకరించినందుకు మత నాయకులకు ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా ప్రార్థనలు చేయాలనుకునేవారు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవచ్చు, మసీదులను సందర్శించేవారు హోలీ వేడుకలను గుర్తుంచుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది హోలీ, శుక్రవారం నమాజ్ ఒకే రోజు వస్తున్నాయి.

అయితే, పోలీస్ అధికారి వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి శర్వేంద్ర బిక్రమ్ సింగ్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి వద్ద మంచి పేరు సంపాదించుకోవడానికి అధికారులు ఆయన చెప్పినట్లు చేస్తున్నారు. అధికారులు బీజేపీ ఏజెంట్లుగా వ్యవహరించవద్దు’’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ మీడియా కమిటీ వైస్ చైర్మన్ మనీష్ హింద్వి మాట్లాడుతూ, “ఒక అధికారి, వారు ఎవరైనా, లౌకికంగా ఉండాలి. అప్పుడే ఈ దేశంలో పాలన సరిగ్గా పనిచేయగలదు. లేకుంటే, అది అరాచకానికి దారి తీస్తుంది.” అని చెప్పారు.