Adani-Italy Deal: అదానీ గ్రూప్, ఇటలీకి చెందిన లియోనార్డో ఏరోస్పేస్ కంపెనీతో ఒప్పందం కుదిరింది. భారత్‌లో హెలికాప్టర్ల తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ భాగస్వామ్యాన్నికి సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) మంగళవారం న్యూఢిల్లీలో కుదిరింది. ఈ భాగస్వామ్యం ‘‘మేక్ ఇన్ ఇండియా’’ ప్రోగ్రాంకు ముందడుగుగా భావిస్తున్నారు. హెలికాప్టర్ల తయారీలో భారత్ స్వయం సమృద్ధిగా మారే అవకాశం ఉంది.
ఈ ఒప్పందం ద్వారా భారత్‌లో ఒక ఇంటిగ్రేటెడ్ హెలికాప్టర్ తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. సాయుధ దళాలకు అవసరమయ్యే హెలికాప్టర్ల అవసరాలను తీర్చడంపై రెండు కంపెనీలు దృష్టిసారిస్తాయి. లియోనార్డో అభివృద్ధి చేసిన ఆధునిక AW169M, AW109 TrekkerM హెలికాప్టర్ల తయారీకి ఈ డీల్ ఉపయోగపడుతుంది. ఈ భాగస్వామ్యం ద్వారా దశలవారీగా భారత్‌లో ఉత్పత్తి, మెయింటనెన్స్ రీపేర్ అండ్ ఓవర్ హాల్ సౌకర్యాలు, పైలట్ శిక్షణ అందించనున్నట్లు అధికార ప్రకటనలో తెలిపారు.
దేశ జనాభాతో పోల్చితే 250 కన్నా తక్కువ హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయని, రాబోయే 10 ఏళ్లలో ప్రతీ ఏడాది సగటున 100 అవసరం అవుతాయని అంచనా వేశారు. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ డైరెక్టర్ జీత్ అదానీ మాట్లాడుతూ.. సివిల్, డిఫెన్స్ రంగాల అవసరాలను తీర్చే విధంగా ఒక సమగ్ర ఏవియేషన్ ఎకోసిస్టమ్ ను భారత్‌లో నిర్మించడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని చెప్పారు. అదానీ గ్రూప్ సీఈఓ ఆశిష్ రాజవంశీ మాట్లాడుతూ.. వచ్చే 10 ఏళ్లలో భారత సాయుధ దళాలకు వెయ్యికి పైగా హెలికాప్టర్ల అవసరం ఉంటుందని, ఈ డీల్ స్వదేశీ తయారీ లక్ష్యాన్ని సాకారం చేస్తుందని అన్నారు.
లియోనార్డో హెలికాప్టర్స్ ఎండీ జియన్ పియరో కుటిలో మాట్లాడుతూ.. భారత్ ఒక భారీ మార్కెట్ అని, సాయుధ దళాల హెలికాప్టర్ల అవసరం వేగంగా పెరుగుతోందని చెప్పారు. ఇదిలా ఉంటే, ఇటీవల అదానీ డిఫెన్స్ అండ్ ఎరోస్పేస్ సంస్థ బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రాయర్ సంస్థతో కలిసి భారత్‌లో ప్రాంతీయ విమాన తయారీ కేంద్రం ఏర్పాటుకు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.