Site icon NTV Telugu

Harshil Kalia: విషాదం.. కారు ప్రమాదంలో నటి హర్షిల్ కాలియా కన్నుమూత

Harshilkalia

Harshilkalia

నటి, మోడల్ హర్షిల్ కాలియా (30) హఠాన్మరణం చెందారు. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ముంచుకు రావడంతో చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి. కారు డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

రాజస్థాన్‌కు చెందిన హర్షిల్ కాలియా జైపూర్‌లో సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా కారు డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం కారు పల్టీలు కొట్టింది. దీంతో స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోయారు. వాహనం అతివేగంతో వెళ్తోందా లేక మరో వాహనం దానిని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించిందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక పోస్ట్‌మార్టం ద్వారా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

హర్షిల్ కాలియా ‘క్రైమ్ నెక్స్ట్ డోర్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఒక న్యూస్ ఛానెల్‌కు యాంకర్‌గా కూడా వ్యవహరించి. పలు రాజస్థానీ పాటల్లో కథానాయికగా నటించింది. ఇటీవల మోడలింగ్‌లో కూడా కెరీర్‌ను సాగిస్తోంది. ఇక కాలియా తండ్రి కూడా పాత్రికేయ రంగంతో సంబంధం కలిగి ఉన్నారు. ఒక ప్రైవేట్ వార్తాపత్రికలో పనిచేస్తున్నారు.

Exit mobile version