గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్న రీతిలో.. కానిస్టేబుల్‌ను పట్టుకుందామని వచ్చిన ఏసీబీ అధికారులకు ఓ అవినీతి ఎస్సై దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని తుముకూరు గుబ్బిన్ తాలూకాలో పోలీసులు ఓ కేసు నిమిత్తం చంద్రన్న అనే వ్యక్తి వాహనాన్ని సీజ్ చేశారు. అయితే రూ.28 వేలు లంచం తీసుకుని వాహనాన్ని వదిలిపెట్టాలని ఎస్సై సోమశేఖర్.. కానిస్టేబుల్ నయాజ్ అహ్మద్‌కు సూచించాడు. దీంతో బాధితుడు చంద్రన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ కోసం ఏసీబీ అధికారులు కాపు కాశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ రూ.12వేలు లంచం తీసుకుంటుండగా అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Read Also: హైదరాబాద్ పాతబస్తీలో పేలుడు, ఇద్దరు మృతి
ఎస్సై లంచం తీసుకోమని చెప్పడంతోనే తాను అవినీతికి పాల్పడ్డానని ఏసీబీ అధికారుల విచారణలో కానిస్టేబుల్ నోరు విప్పడంతో వారు పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. ఏసీబీ అధికారులు తన కోసం వస్తున్నారని సమాచారం తెలుసుకున్న ఎస్సై సోమశేఖర్.. తన యూనిఫారం చొక్కాను చెత్తబుట్టలో పడేసి రోడ్డుపై పరుగులు పెట్టాడు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు కిలోమీటర్ దూరం వెంబడించి స్థానికుల సహాయంతో ఎస్సైను పట్టుకున్నారు. అనంతరం అవినీతికి పాల్పడ్డ ఎస్సైను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
