Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం

  • నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది
  • అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
  • మహారాష్ట్రలో కుటుంబ సభ్యులు సంబరాలు
Abhijeet Dipke

Abhijeet Dipke

తన కొడుకు కష్టానికి ఫలితం దక్కిందని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే తల్లి అనితా దీప్కే సంతోషం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజ్‌ వ్యవహారంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నెల రోజులకు పైగా ఢిల్లీ జంతర్‌మంతర్ దగ్గర ఆందోళన చేపట్టారు. ఈ ఉద్యమానికి దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, రాజకీయ నాయకులు మద్దతు తెలిపారు. మొత్తానికి శనివారం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో అభిజిత్ దీప్కే కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో మీడియాతో మాట్లాడిన అభిజిత్ దీప్కే తల్లి అనితా దీప్కే తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది మా కుటుంబానికి చాలా ప్రత్యేకమైన రోజు. నా కొడుకు చేసిన నిజాయితీ పోరాటానికి చివరకు ఫలితం దక్కింది. అతను మొదటి నుంచే తన డిమాండ్ నెరవేరాల్సిందేనని గట్టిగా చెప్పేవాడు. తన లక్ష్యాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గలేదు.’’ అని తెలిపారు. అయితే కొడుకు ఢిల్లీలో నిరసనలో పాల్గొంటున్న సమయంలో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైందని చెప్పారు.

‘‘అతనితో పాటు చాలా మంది విద్యార్థులు ఉన్నప్పటికీ.. తల్లిదండ్రులుగా మాకు భయంగానే ఉండేది. జైపూర్‌లో అతనిపై దాడి చేసి చెంపదెబ్బ కొట్టిన ఘటన మాకు తీవ్ర బాధ కలిగించింది. ఆ రోజు రాత్రంతా మేము నిద్రపోలేకపోయాం.’’ అని భావోద్వేగానికి గురయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తమ కుమారుడికి ఘన స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నామని అనితా దీప్కే తెలిపారు. కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకుంటామని పేర్కొన్నారు.