Abhijeet Dipke: అమెరికా చదువుపై విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన అభిజీత్‌ దీప్కే

  • అమెరికా చదువుపై విమర్శలు
  • క్లారిటీ ఇచ్చిన అభిజీత్‌ దీప్కే
  • జార్ఖండ్ ఉద్యమానికి మద్దతు
Abhijeetdipke

Abhijeetdipke

ఢిల్లీ ఉద్యమం తర్వాత సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమెరికా ఎడ్యుకేషన్  ఫండింగ్‌లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అభిజీత్ దీప్కే క్లారిటీ ఇచ్చారు. అన్ని విమర్శలకు త్వరలో సమాధానం ఇస్తానని తెలిపారు. ఇక అమెరికా ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. బోస్టన్ యూనివర్సిటీ ఇచ్చిన స్కాలర్‌షిప్‌తో పాటు విద్యా రుణం ద్వారా చదువు పూర్తి చేసినట్లు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం విద్యా రుణాన్ని తీర్చుతున్నట్లు వెల్లడించారు.

సీజేపీ పేరుతో కొనసాగుతున్న ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం తగ్గిపోతున్న నేపథ్యంలో మరో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం కంటే విస్తృత ప్రజా ఉద్యమం అవసరమని అన్నారు. అయితే తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మరోసారి ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

‘‘మాకు అలాంటి ఉద్దేశం లేదు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ఉపయోగించి రాజకీయ పార్టీలను ఎలా చీల్చుతున్నారో చూస్తున్నాం. ఎన్నికల్లో ఓట్లను తొలగిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాజకీయ వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్న సమయంలో.. మరో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి మనం ఏం సాధిస్తాం?’’ అని దీప్కే ప్రశ్నించారు. ప్రజల్లో నమ్మకం తగ్గడం కేవలం రాజకీయ వ్యవస్థకే పరిమితం కాలేదన్నారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల వ్యవస్థతో పాటు మీడియాపై కూడా ప్రజల విశ్వాసం తగ్గుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి మరో రాజకీయ పార్టీ కంటే బలమైన ప్రజా ఉద్యమం అవసరమని అభిప్రాయపడ్డారు.

సీజేపీ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మరోసారి నిరసన చేపడతామని అభిజీత్ దీప్కే హెచ్చరించారు. నీట్-యూజీ పరీక్షకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించాలన్న డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదని ఆరోపించారు. ‘‘ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లను అమలు చేయాలని మేం కోరుతున్నాం. అలా చేయకపోతే మళ్లీ ఆందోళనకు దిగాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. పరిహారం అంశాన్ని పరిశీలించే సమయంలో ప్రభుత్వం నిబంధనలు, నియమావళిని ప్రస్తావిస్తోందని విమర్శించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని.. కానీ బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం ముందుగా నిబంధనలు పరిశీలిస్తారని ఆరోపించారు.

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీజేపీ 37 రోజుల పాటు నిర్వహించిన నిరసనలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలనే డిమాండ్ ప్రధానంగా ఉంది. అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలని కూడా ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత.. తమ ఇతర డిమాండ్లపై కూడా ప్రభుత్వం నుంచి హామీలు లభించాయని పేర్కొంటూ సీజేపీ జూలై 25న తన ఆందోళనను ముగించింది. అయితే కొత్త కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమించడాన్ని తమ సంస్థ వ్యతిరేకిస్తోందని అభిజీత్ దీప్కే తెలిపారు. ‘‘కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న మా డిమాండ్ నెరవేరింది. కానీ ఆయన స్థానంలో ఎవరిని విద్యాశాఖ మంత్రిగా నియమించారు? ప్రహ్లాద్ జోషిని నియమించారు. ఈ నిర్ణయానికి మేం మద్దతు ఇవ్వడం లేదు’’ అని అన్నారు.

నిరసన సందర్భంగా జూలై 20న చోటుచేసుకున్న హింస ముందస్తు ప్రణాళికతో జరిగిందని అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఉద్యమాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులతో ఢిల్లీ పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి స్వతంత్రంగా ఎలాంటి నిర్ధారణ జరగలేదు. ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచే నిరసనలో గందరగోళం సృష్టించేందుకు బయట వ్యక్తులను పంపించే అవకాశం ఉందని తాను హెచ్చరిస్తూ వచ్చానని దీప్కే పేర్కొన్నారు. ఆ తర్వాత జరిగిన ఘటనలకు సీజేపీ సభ్యులే కారణమని ఆరోపించే ప్రయత్నం జరుగుతుందని ముందే చెప్పానన్నారు.

జూలై 20న జరిగిన ఘటనకు ఒక రోజు ముందు జంతర్‌మంతర్‌లోని వేదిక వెనుక రాళ్లతో నిండిన ట్రక్కును ఢిల్లీ పోలీసులు నిలిపారని ఆరోపించారు. అక్కడ ముందుగానే దెబ్బతిన్న వ్యాన్‌ను కూడా పార్క్ చేశారని తెలిపారు. మరుసటి రోజు నిరసనలో రాళ్ల దాడి జరిగినట్లు వార్తలు రావడం వెనుక ముందస్తు ప్రణాళిక ఉందని ఆరోపించారు. ‘‘జూలై 19న జంతర్‌మంతర్‌లోని వేదిక వెనుక రాళ్లతో నిండిన ట్రక్కును ఢిల్లీ పోలీసులు ఎందుకు నిలిపారు? జూలై 20కు ముందే అక్కడ దెబ్బతిన్న వ్యాన్‌ను ఎందుకు పార్క్ చేశారు? మరుసటి రోజు నిరసనలో రాళ్ల దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనను ఢిల్లీ పోలీసులు ముందే ప్రణాళిక చేసినట్లు కనిపిస్తోంది’’ అని దీప్కే ఆరోపించారు.

కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న ఢిల్లీలో ఇలాంటి ఘటన ఎలా జరిగిందని ప్రశ్నించారు. నిరసన ప్రదేశంలో హింసను అడ్డుకోవడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. నిరసనకారులపై పోలీసుల చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు కూడా వేర్వేరుగా డిమాండ్ చేశాయి.

సీజేపీ ఉద్యమాన్ని ‘దేశ వ్యతిరేకం’గా అభివర్ణిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ నేత అతుల్ లిమయే చేసిన వ్యాఖ్యలపై కూడా అభిజీత్ దీప్కే స్పందించారు. మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే హత్య చేసిన ఘటనను ప్రస్తావిస్తూ ఆయన విమర్శలకు సమాధానం ఇచ్చారు. జార్ఖండ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలకు సీజేపీ మద్దతు ఇస్తుందని తెలిపారు. తన ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత జార్ఖండ్‌ను సందర్శించి విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తానని వెల్లడించారు.