Flight Bomb Threats: గత కొన్ని రోజులుగా భారతదేశ విమానయాన రంగం తీవ్ర బెదిరింపుల్ని ఎదుర్కొంటోంది. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ, విస్తారా ఇలా అన్ని సంస్థలకు చెందిన విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. గత వారం నుంచి ఏకంగా 100కు పైగా విమానాలు బెదిరింపులు ఎదుర్కోన్నాయి. వీటిలో అంతర్జాతీయ, దేశీయ విమానాలు ఉన్నాయి.అయితే, వీటిలో చాలా వరకు బెదిరింపులు ఎక్స్(ట్విట్టర్) ఖాతాల నుంచి వచ్చినవే.
Read Also: Zomato Platform Fee: పండగ వేళ జొమాటో కస్టమర్లకు షాక్.. ఇకనుంచి ఎక్కువ చెల్లించాల్సిందే!
ఈ నేపథ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖ ఈ రోజు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జాయింట్ సెక్రటరీ సంకేత్ ఎస్ భోంద్వే ఎయిర్‌లైన్స్, ఎక్స్ , మెటా వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ప్రతినిధులతో వర్చువల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అధికారులు ఎక్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ‘‘ఎక్స్ ప్రేరేపిత నేరం’’గా ఆరోపించారు. ఇలాంటి పుకార్లు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
గత కొన్ని రోజులుగా భారతీయ విమానయాన సంస్థలను నిర్వహిస్తున్న 120కి పైగా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. దీంతో చాలా విమానాలు అత్యవసరంగా ల్యాండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతపై రాజీ పడకుండా ప్రభుత్వం సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. ఇలాంటి బెదిరిపులకు పాల్పడే వారిని ‘‘నోఫ్లై’’ లిస్టులో పెడతామని హెచ్చరించారు.