NTV Telugu Site icon

AAP vs BJP: ‘‘రావణుడు బంగారు జింకగా వచ్చాడా..?’’ కేజ్రీవాల్‌పై బీజేపీ విమర్శలు..

Kejriwal

Kejriwal

AAP vs BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ వర్సెస్ బీజేపీ నడుస్తోంది. ఇరు పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ రావణుడు బంగారు జింక రూపంలో వచ్చి సీతని అపహరించాడు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది.

ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ.. రావణుడు సీతను అపహరించిన దానిపై మాట్లాడారు. ‘‘సీతను చూసుకోవాలని సోదరుడు లక్ష్మణుడికి రామచంద్రుడు సూచించాడు. ఆయన అడవిలో ఆహారం ఏర్పాటు చేయడానికి వెళ్లాడు. రావణుడు బంగారు జింక రూపంలో వచ్చాడు. సీతమ్మ లక్ష్మణుడితో ఆ జింక కావాలని కోరింది. లక్ష్మణుడు ముందు వెళ్లేందుకు నిరాకరించాడు. ఆ తర్వాత జింకను వెతుక్కుంటూ వెళ్లాడు. ఆ తర్వాత రావణుడు తన జింక రూపాన్ని మార్చుకుని సీతను అపహరించాడు. బీజేపీ వాళ్లు బంగారు జింక లాంటి వారు, వారి ఉచ్చులో పడకండి’’ అని అన్నారు.

Read Also: Etela Rajender: 25 ఏళ్ల జీవితంలో ఎవరిపై చేయి చేసుకోలేదు.. న్యాయం కోసం తప్పలేదు

నిజానికి రామాయణం ప్రకారం..‘‘బంగారు జింక’’ రూపాన్ని ధరించిన వాడు ‘‘మారీచుడు’’ అనే రాక్షసుడు. జింకను వేటాడేందుకు లక్ష్మణుడు వెళ్లిన సమయంలో, సన్యాసి రూపంలో వచ్చిన రావణుడు సీతమ్మ వారిని అపహరించాడు. కేజ్రీవాల్ చేసిన తప్పుడు వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ.. కేజ్రీవాల్ హిందూ మతాన్ని అవమానించారని అన్నారు. ‘‘రావణుడు బంగారు జింక రూపాన్ని ఎప్పుడు ధరించాడు..?’’ అని ప్రశ్నించాడు. శీష్ మహల్‌లో నివసిస్తున్న కేజ్రీవాల్‌కి బంగారంపై మక్కువ పోలేదని విమర్శించారు.

ఎన్నికల సమయంలోనే కేజ్రీవాల్ ‘‘ఎన్నికల హిందువు’’గా మారుతాడని అన్నారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు రాముడే న్యాయం చేస్తాడని ఎన్నికలను ఉద్దేశించి అన్నారు. అయితే, బీజేపీ విమర్శలకు ప్రతిగా మనీష్ సిసోడియా మాట్లాడుతూ, బీజేపీ రావణుడిలా తన వారసులను సమర్థిస్తోందని అన్నారు. ఢిల్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విమర్శలు పెరిగాయి. మొత్తం 70 స్థానాలు ఉన్న అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు, ఫిబ్రవరి 08న ఫలితాలు వెలువడనున్నాయి.