NTV Telugu Site icon

Kolkata rape-murder Case: డాక్టర్ హత్యాచార నిందితుడి కేసుని వాదిస్తోంది ఓ మహిళ.. ఆమె ఎవరంటే..?

Rg Kavita Sarkar

Rg Kavita Sarkar

Kolkata rape-murder Case: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఘటన యావద్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనపై దేశంలోని డాక్టర్లు, సాధారణ ప్రజలు ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికీ ఈ ఘటనపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా కేసుని సీబీఐకి అప్పగించింది కలకత్తా హైకోర్టు. ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌ని ఘటన జరిగి కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే అతడి తరుపున కోర్టులో ఒక మహిళా న్యాయవాది వాదిస్తోంది. ఈ కేసు సంచలనంగా మారడంతో అతడి తరుపున వాదించేందు పలువురు న్యాయవాదులు ముందుకు రాకపోవడంతో సీల్దా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది మరియు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (SALSA) సభ్యురాలు కవితా సర్కార్ సంజయ్ రాయ్ తరుపున కోర్టులో వాదించేందుకు నియమించబడ్డారు. ఎంతటి నేరానికి పాల్పడిన నిందితుడికైనా, అతడి తరుపున వాదించేందుకు ఓ లాయర్ ఖచ్చితంగా ఉండాలి. ఇది మన న్యాయవ్యవస్థలో కీలకాంశం. ముంబై ఉగ్రదాడి సమయంలో కూడా ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కి కూడా ఓ న్యాయవాది నియమించబడ్డాడు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A ప్రకారం సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అందిస్తుంది. లింగం, జాతి మరియు మతం వంటి ఎటువంటి వివక్ష లేకుండా చట్టపరమైన ప్రక్రియకు పౌరుడు ఉచిత ప్రాప్యతను కలిగి ఉండే హక్కుని కల్పిస్తుంది

సంజయ్ రాయ్ తరుపు న్యాయవాది అయిన కవితా సర్కార్ అతడికి సీబీఐ నిర్వహించే పాలిగ్రాఫ్ టెస్టు గురించి వివరించింది. ఈ టెస్టు కోసం రాయ్ సమ్మతిని, చట్టబద్ధతను ఆమె అతడికి వివరించే విషయంలో కీలక పాత్ర పోషించారు. దీని తర్వాత లై డిటెక్టర్ టెస్టుగా పిలిచే ఈ పరీక్ష చేయించుకునేందుకు అతను అంగీకరించాడు. అతను నేరం చేశానని భావించాడని, అతను మానసిక ఒత్తిడికి లోనయ్యాడని ఆమె ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీనికి ముందు కోల్‌కతా పోలీసులు, సీబీఐ ముందు రాయ్ నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని శుక్రవారం సీల్దా కోర్టులో హాజరిచే అవకాశం ఉంది, అతని వెంట కవితా సర్కార్ ఉండనున్నారు.

Read Also: Draupadi Murmu: వైద్యురాలి అత్యాచార ఘటనపై తొలిసారిగా స్పందించిన రాష్ట్రపతి.. ఏమన్నారంటే?

ఎవరీ కవితా సర్కార్:

ఈ కేసుని ఎవరూ వాదించేందుకు ముందుకు రాకపోవడంతో నిందితుడు సంజయ్ రాయ్ తరుపున వాదించే బాధ్యత కవితా సర్కార్‌పై పడింది. 52 ఏళ్ల న్యాయవాది కవిత లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌లో కూడా సభ్యురాలు, ఇది లీగల్ ఫీజు చెల్లించలేని వారికి లేదా ఏ న్యాయవాది తీసుకోకూడదనుకునే వారికి న్యాయ సహాయం అందిస్తుంది.

కవిత హుగ్లీ మొహ్సిన్ కళాశాల నుండి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. అలీపూర్ కోర్టులో తన వృత్తిని ప్రారంభించారు. గతేడాది జూన్ నెలలో సీల్దా కోర్టుకి బదిలీ అయ్యారు. ఈమెకు న్యాయవాద వృత్తిలో 25 ఏళ్ల అనుభవం ఉంది. ఫిబ్రవరి 2023లో ఆమె స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (SALSA)లో క్రిమినల్ లాయర్‌గా చేరారు.

ఉరిశిక్ష విధించాలనే డిమాండ్‌కి తాను వ్యక్తిగతంగా మద్దతు ఇవ్వనని ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు. అందరి లాగే తాను కూడా బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటాను. అయితే తన వరకు మాత్రం కోర్టు విచారణ తర్వాతే న్యాయం దక్కుతుందని చెప్పారు. నిందితులతో సహా ప్రతీ ఒక్కరికి దేశంలో ఉచిత న్యాయ విచారణ హక్కు ఉందని చెప్పారు. తాను వాదిస్తున్న అత్యంత ఉన్నతమైన కేసు ఇదే అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ కేసు గురించి తన తల్లిదండ్రులకు చెప్పలేదని, తన భర్త తనకు మద్దతుగా నిలిచారని చెప్పారు.