A Gang In Bangalore Trapped A High Court Employee Got Caught: హనీట్రాప్ మోసాలు ఆగడం లేదు. అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనుకుంటున్న కొన్ని ముఠాలు.. బడాబాబుల్ని ఇంకా టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో వల వేయడమే, లేకపోతే నేరుగా ముగ్గులోకి దింపడమో చేసి.. బెదిరింపులకి పాల్పడుతూ, డబ్బులు దోచేసే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఓ ముఠా ఏకంగా హైకోర్టు ఉద్యోగినే ట్రాప్ చేయబోయింది. ఒక అమ్మాయితో స్నేహం చేయించి, నేరుగా ఇంటికి పిలిపించి.. ఎఫైర్ అంటగట్టేందుకు ట్రై చేశారు. దాదాపు సక్సెఫ్‌ఫుల్ అయ్యారు కానీ, ఆ ఉద్యోగి పోలీసుల్ని ఆశ్రయించడంతో.. వారి సరదా తీరింది. కర్ణాటకలోకి బెంగళూరులో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
హైకోర్టు ఉద్యోగి అయిన జైరామ్‌కు రెండేళ్ల క్రితం అనురాధ అనే మహిళ పరిచయమైంది. అప్పట్నుంచి వీరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది. చివరికి మంచి స్నేహితులు అయ్యారు. కట్ చేస్తే.. ఆరు నెలల క్రితం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో కొన్ని వస్తువులు కాలిపోయాయని, డబ్బు అవసరం ఉందని ఆ మహిళ జైరామ్ వద్ద నుంచి రూ.10 వేలు తీసుకుంది. ఆ డబ్బుని అక్టోబర్ 10న జైరామ్‌కు తిరిగి ఇచ్చేసింది. మళ్లీ అక్టోబర్ 25న రూ. 5 వేలు కావాలని అప్పు అడిగింది. అయితే.. ఈసారి నేరుగా ఇంటికే రమ్మని పిలిచింది. దీంతో జైరామ్ ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడే అతడు హనీట్రాప్‌లో చిక్కుకున్నాడు. మెల్లగా మాటలతో మాయ చేసిన అనురాధ.. అతని వద్ద రూ. 5 వేలు తీసుకుంది. ఆ దృశ్యాన్ని.. ఆల్రెడీ ఆ ఇంట్లో ఉన్న ఒక ముఠా వీడియో తీసింది.
వీడియో చిత్రీకరించిన వెంటనే, దాక్కున్న వ్యక్తులందరూ బయటకు వచ్చారు. ఆ ముఠాలో ఒక వ్యక్తి జైరామ్ వద్దకు వచ్చి.. ‘‘నా భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకుంటావా? నేను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే.. నీ వీడియో బయటపెడతా’’ అని బెదిరించాడు. అంతటితో ఆగకుండా.. జైరామ్ భార్యకు ఫోన్ చేసి, ‘‘నీ భర్త నా భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడు. డబ్బులు ఇస్తున్న వీడియో రికార్డ్ చేశాం. వెంటనే రూ. 2 లక్షలు ఇవ్వండి. లేదంటే ఆ వీడియో లీక్ చేస్తా’’ అని హెచ్చరించాడు. డబ్బులు పంపాక ఆ గ్యాంగ్ జైరామ్‌ని వదిలేసింది. అతడు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. 10 మంది గల ఆ గ్యాంగ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు సిద్దరాజుపై ఇదివరకే పలు కేసులు ఉన్నట్టు తేలింది.