NTV Telugu Site icon

Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లుకు 91 శాతం మంది మద్దతు.. సర్వేలో కీలక విషయాలు..

Waqf Amendment Bill

Waqf Amendment Bill

Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడంతో బిల్లుని పరిశీలించేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ‘‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే, మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకి 91 శాతం మంది మద్దతు తెలిపినట్లు ఓ సర్వేలో తేలింది. దేశంలోని 388 జిల్లాల్లో 47,000 మందికి పైగా మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. 10 మందిలో 9 మంది ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతుగా ఉన్నట్లు వెల్లడైంది.

లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఈ సర్వేని నిర్వహించింది. ఈ సర్వేలో 69 శాతం పురుషులు, 31 శాతం మహిళలు పాల్గొన్నారు. ఇందులో 43 శాతం మంది టైర్-1 నగరాలకు చెందిన వారు కాగా, 26 శాతం మంది టైర్ 2కి చెందిన వారు. మిగిలిన 31 శాతం మంది టైర్ 3,4,5, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు.

Read Also: Siddharth-Adithi Rao Hydari: అదితి రావు – సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్న 400 ఏళ్ల నాటి గుడి రహస్యం ఏంటో తెలుసా?

సర్వేలో భాగంగా ప్రభుత్వం తీసుకువచ్చి వక్ఫ్ బోర్డు పనుల్లో పారదర్శకతను తీసుకువచ్చే బిల్లుకు మద్దతు ఇస్తారా..? అని ప్రజల్ని ప్రశ్నించారు. దీంట్లో 91 శాతం మంది మద్దతు ఇస్తామని సమాధానం ఇవ్వగా, 8 శాతం మంది ఇవ్వమని, ఒక శాతం మంది స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ప్రతిస్పందించిన 15,850 మందిలో 96 శాతం మంది వక్ఫ్ బోర్డులు తమ భూమి మొత్తాన్ని జిల్లా కలెక్టర్లు నమోదు చేయాలని పేర్కొన్నారు. 93 శాతం మంది పౌరులు వక్ఫ్ బోర్డు ఆస్తి వివాదాలు జిల్లా కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టుల ద్వారా పరిష్కరించేలా సవరణలు తేవాలని కోరారు.

ప్రస్తుత వక్ఫ్ చట్టం, 1995 (2013లో సవరించబడింది)కు దాదాపు 40 సవరణలను ప్రతిపాదించే వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024ని వర్షకాల సమావేశాల్లో మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం, అధికారిక రికార్డుల ప్రకారం, వక్ఫ్ బోర్డులు దేశవ్యాప్తంగా 9.4 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న 8.7 లక్షల ఆస్తులను నియంత్రిస్తాయి, దీని విలువ రూ. 1.2 లక్షల కోట్లు. భారత సైన్యం, భారతీయ రైల్వేల తర్వాత అతిపెద్ద భూ యజమానిగా వక్ఫ్ బోర్డు ఉంది.

Show comments