Delhi Road Accident: ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే కారులో ఉన్న నిందితులు యువతి శరీరంతో కారును నడిపారని తెలుస్తోంది. దాదాపుగా గంట పాటు 13 కిలోమీటర్లు కారు కింద బాధితురాలు అంజలి సింగ్ శరీరంతో కారును వేగంగా పోనిచ్చినట్లు సీసీ కెమరా పుటేజీల్లో రికార్డు అయింది. ఈ ఘటనలో పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా 9 పోలీస్ వ్యాన్లు ఉన్నా కూడా ప్రమాదానికి కారణం అయిన కారును గుర్తించలేకపోయారు.
జనవరి 1న న్యూఇయర్ పార్టీకి వెళ్లి వస్తున్న సమయంలో అంజలి అనే 20 ఏళ్ల యువతిని ఢీకొట్టిన కారు కొన్ని కిలోమీటర్ల మేర ఆమెను ఈడ్చుకెళ్లిన ఘటన ఢిల్లీలో జరిగింది. ఈ భయానక ప్రమాదంలో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో న్యూఇయర్ వేడుకలకు వెళ్లి తన స్నేహితురాలు నిధితో కలిసి స్కూటీలో వస్తున్న అంజలి సింగ్ ను ఓ కారు ఢీ కొట్టింది. ఆ తరువాత అంజలి కాలు కారు కింది భాగంలో చిక్కుకుంది. అయితే ఆమె శరీరాన్ని కారు నుంచి వేరు చేసే ఉద్దేశ్యంతో నిందితులు కారును పలుమార్లు మలుపులు తిప్పారు. ఈ ఘటనలో ప్రమాద సమయంలో అండగా ఉండాల్సిన అంజలి స్నేహితురాలు నిధి అక్కడి నుంచి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పారిపోయింది. ప్రమాదం బారిన పడిన అంజలి నొప్పితో అరుస్తున్నా పట్టించుకోకుండా నిందితులు కారును అలాగే పోనిచ్చారని పోలీసులకు చెప్పింది.
యాక్సిడెంట్ తర్వాత మహిళ శరీరం కారు కింద చిక్కుకుపోయిందని తెలిసినా..కారును మలుపులు తీసుకుని, ముందుకు వెనక్కి నడిపినట్లు తెలుస్తోంది. సుమారు రెండున్నర కిలోమీటర్ల తరువాత నిందితులు చక్రాల కింద ఉన్న మహిళ చేతిని కూడా గుర్తించారు, కానీ ఆపలేదని తెలుస్తోంది. కిటికీలోంచి చూసినప్పుడు, ఆమె చేయి బయటికి రావడం చూశారు.. కానీ వారు పోలీసు కారును గుర్తించి అలాగే కారును నడిపారని తెలుస్తోంది. మృతదేహాన్ని తొలగించేందుకు ప్రయత్నించి, కారు నాలుగు కంటే ఎక్కువ యు-టర్న్‌లు తీసుకుందని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో అంజలి శరీరంపై చర్మం తొలిగిపోయింది. పుర్రె పగిలిపోయింది, మెదడు పదార్థం బయటపడింది. మొత్తం 40 వరకు బాహ్యగాయాలు కనిపించాయి.
ఈ ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో ఐదు పోలీసులు వ్యాన్లు ఉన్నా గుర్తించకలేకపోయాయి. కారు కింద శరీరం ఉందని దీపక్ దహియా అనే వ్యక్తి గమనించి పోలీసులకు 20కి పైగా కాల్స్ చేశానని వెల్లడించాడు. కారు కోసం వెతకడానికి సుమారు తొమ్మిది వాహనాలను పంపినా.. కారును కనుక్కోవడంలో విఫలం అయ్యారు. 2.18 గంటలకు ప్రమాదం జరిగితే.. 4.26 గంటలకలు మృతదేహాన్ని కనుక్కున్నారు.
