Power cut in the President’s program: కరెంట్ కోతలు సామాన్యుడికే కాదు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా తప్పడం లేదు. ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా కరెంట్ పోయింది. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశాలోని బరిపాడలోని మహారాజా శ్రీ రామచంద్ర భంజదేయో విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవానికి శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఆమె ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ పోయింది. దీంతో లైట్లు ఆఫ్ కావడంతో వేదికపై చీకటి అలుముకుంది.
Read Also: FM Radio On Mobiles: అన్ని మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో ఉండాల్సిందే.. కేంద్రం హెచ్చరిక..
దాదాపుగా తొమ్మిది నిమిషాల పాటు పవర్ కట్ ఏర్పడింది. హై సెక్యూరిటీ ప్రోగ్రామ్ లో ఇలాంటి ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. శనివారం ఉదయం 11.56 నుంచి 12.05 నిమిషాల పాటు విద్యుత్ కోత ఏర్పడింది. రాష్ట్రపతి ముర్ము ప్రసంగం ప్రారంభం అయిన తర్వాత కొద్ది సేపటికే ఇది జరిగింది. అయితే ఆమె మాట్లాడే మైక్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ సక్రమంగా పనిచేస్తుండటంతో ఆమె ప్రసంగాన్ని కొనసాగించారు. కరెంట్ పోయిన సభకు విచ్చేసిన వారు ఆమె ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఒడిశా రాష్ట్రపతి సొంతరాష్ట్రం. మయూర్ భంజ్ జిల్లాలోని రాయ్‌రంగ్‌పూర్‌కు చెందిన ద్రౌపది ముర్మును ఆ ప్రాంత ప్రజలు ‘భూమి పుత్రిక’గా పరిగణిస్తారు.
ఇదిలా ఉంటే టాటా పవర్, నార్త్ ఒడిశా పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ సీఈవో భాస్కర్ సర్కార్ మాట్లాడుతూ హాల్‌లో డిస్ట్రిబ్యూషన్ అంతరాయం కలగలేదని, విద్యుత్ వైరింగ్ లో కొన్ని లోపాల వల్లే సమస్య తలెత్తిందని తెలిపారు. యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ సంతోష్ కుమార్ త్రిపాఠి ఘటనపై విచారం వ్యక్తం చేశారు మరియు అధ్యక్షుడు ముర్ము ప్రసంగం సమయంలో విద్యుత్ లోపంపై క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై ఖచ్చితంగా విచారణ చేస్తామని, బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.