Viral Video: “గుండె నిండా ధైర్యం, సాధించాలనే కసి ఉంటే వయసుతో పనేంటి? అది కేవలం ఒక నంబర్ మాత్రమే” అని నిరూపించాడు హర్యానాకు చెందిన ఒక పెద్దాయన. ఈ జనరేషన్ కుర్రాళ్లకు సవాల్ విసిరేలా.. ఆస్ట్రేలియా ఆకాశంలో ఆయన చేసిన ఒక సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన మనవడితో కలిసి ఏకంగా 18,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ (Skydiving) చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
‘భయమంటే నా డిక్షనరీలోనే లేదు!’
అంకిత్ అనే యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అంకిత్ తన తాతను స్కైడైవింగ్ కోసం ఆస్ట్రేలియా తీసుకువెళ్లాడు. అయితే ఈ పెద్దాయనకు ఇది మొదటిసారి కాదు. గతంలోనే ఆయన 15,000 అడుగుల ఎత్తు నుంచి సక్సెస్‌ఫుల్‌గా స్కైడైవ్ చేశారు. కానీ ఈసారి తన రికార్డు తానే బద్దలు కొట్టాలని ఏకంగా 18,000 అడుగుల ఎత్తు నుంచి దూకాలని తాతా-మనవళ్లు నిర్ణయించుకున్నారు. విమానం ఎక్కే ముందు మనవడు అంకిత్ సరదాగా.. “తాతా, భయమేస్తోందా?” అని అడిగాడు. దానికి ఆ పెద్దాయన ఏమాత్రం తడుముకోకుండా నవ్వుతూ.. “భయమా? నాకా? ఎవడు భయపడతాడు!” అంటూ ఇచ్చిన సమాధానం నెటిజన్లు ఫిదా చేస్తుంది.
18 వేల అడుగుల పైన ‘జైహింద్’ నినాదాలు.. చేతిలో త్రివర్ణ పతాకం
సాహసం అక్కడితో ఆగలేదు. ఆకాశం నుంచి ఫ్రీఫాల్ (గాల్లో తేలుతూ కిందకు వచ్చే సమయం) అవుతున్న సమయంలో.. ఆ తాత ఏమాత్రం కంగారు పడకుండా తన చేతుల్లో ఉన్న భారత జాతీయ జెండాను గర్వంగా ప్రదర్శించాడు. అంతేకాదు, గాల్లో తేలుతూనే పూర్తి జోష్‌తో “జై హింద్! జై భారత్! జై హర్యానా!” అంటూ నినాదాలు చేశాడు. వేల అడుగుల ఎత్తులో ఆకాశంలో వినిపించిన ఆయన దేశభక్తి నినాదాలు, ముఖంలో కనిపించిన చిరునవ్వు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ అద్భుతమైన వీడియోకు అంకిత్.. “మా తాతాజీ ఆస్ట్రేలియాలో 18,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేస్తున్నారు” అని క్యాప్షన్ జోడించారు. ఈ వయసులోనూ ఆయన చూపిన ఆత్మవిశ్వాసం, పట్టుదల, సాహసానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. “నువ్వు నిజంగా సూపర్ తాతా!” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

