NTV Telugu Site icon

Wolf Attack: వేటాడుతున్న తోడేళ్లు.. యూపీలో 8 మంది మృతి..

Wolf Attack

Wolf Attack

Wolf attack: ఉత్తర ప్రదేశ్ బహ్రైచ్‌ జిల్లాలో తోడేళ్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తోడేళ్ల దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో తోడేళ్ల దాడిలో ఓ చిన్నారి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఖారీపైర్‌లోని ఛత్తర్‌పూర్‌లో సోమ, మంగళవారం మధ్యరాత్రి 3,6,9 ఏళ్లు కలిగిన ముగ్గురు పిల్లలపై దాడి చేసినట్లుగా అధికారులు తెలిపారు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకునేలోపే తోడేళ్లు సమీపంలోని రాయ్‌పూర్ గ్రామానికి వెళ్లాయని, అక్కడ 5 ఏళ్ల చిన్నారిని ఇంటి నుంచి పట్టుకెళ్లాయని చెప్పారు.

ఈ ప్రాంతంలో గత రెండు నెలలుగా తోడేళ్ల దాడులు ఎక్కువ అయ్యాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఏడుగురు చిన్నారులు, ఒక మహిళ సహా 8 మంది చనిపోయారు. బహ్రైచ్ జిల్లా కలెక్టర్ మోనికా రాణి గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో పడుకోవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.

RAED ALSO: Mollywood: మలయాళ ఫిలిం ఇండస్ట్రీ లైంగిక వేధింపులు కలకలం.. ఇప్పటి వరకు 17 కేసులు..

ఈ దాడులు జరిగినప్పటి నుంచి అటవీశాఖతో పాటు స్థానిక పోలీసులు, నాలుగు జిల్లాల డివిజన్ ఫారెస్ట్ అధికారులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. తోడేళ్ల దారి మళ్లించేందుకు అటవీ శాఖ ఏనుగు పేడ, మూత్రాన్ని కూడా వినియోగిస్తోంది. తోడేలు గుంపును పర్యవేక్షించడానికి హై ప్రీక్వెన్సీ డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్‌ల సాయంతో ఇప్పటి వరకు 6 తోడేళ్లను బంధించినట్లు అధికారులు చెప్పారు.

ఏనుగు పేడకు నిప్పటించడం ద్వారా సమీపంలో ఏనుగు లాంటి పెద్ద జంతువులు ఉన్నాయని భ్రమ కల్పించి తోడేళ్లు నివాస ప్రాంతాలకు దూరంగా వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వేటాడే గుణం ఉన్న తోడేళ్లు, ఏనుగు లాంటి పెద్ద జంతువుల జోలికి వెళ్లవు. గత 40 రోజుల్లో సుమారుగా 30 దాడులు జరిగాయని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తోడేళ్లు ఇళ్లలో నిద్రిస్తున్న వారిపై దాడి చేసి, వారిని ఈడ్చుకెళ్లి నిర్మానుష్య ప్రాంతాల్లో తినే పద్దతిని అనుసరిస్తాయని ఆయన చెప్పారు. తోడేళ్ల దాడుల కారణంగా అటవీ శాఖ, పోలీసులు, స్థానిక నివాసితులు రాత్రిపూట గస్తీ పెంచారు. అయితే, గస్తీ పెంచడంతో తోడేళ్లు తమ దాడి సమయాన్ని మార్చుకుంటున్నాయని చెప్పారు.