Site icon NTV Telugu

Agnipath Scheme: 3 రోజుల్లో ‘అగ్నిపథ్‌’ స్కీంకు వచ్చిన దరఖాస్తులెన్ని?

Agnipath Recruitment

Agnipath Recruitment

త్రివిధ దళాలలో చేరాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి తొలి మూడు రోజుల్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ స్కీంకు సంబంధించి శుక్రవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలి మూడు రోజుల్లో 59,960 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జూలై 5న దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుందని.. ఆసక్తి ఉన్న వారు జూలై 5లోగా agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు దరఖాస్తు, అప్‌లోడ్ చేసిన కాపీలను తమ వద్ద ఉంచుకోవాలని తెలిపారు. ఈ ఏడాదికి సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 17.5 సంవత్సరాల నుంచి 23 ఏళ్ల వయసు ఉండాలని అధికారులు వెల్లడించారు.

కాగా ఓ వైపు దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీంపై ఆందోళనలు కొనసాగుతున్నా తొలి మూడు రోజుల్లో భారీగా దరఖాస్తులు రావడం అధికారులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఈ స్కీమ్‌పై అభ్యర్థుల్లో అపోహలు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. జూన్ 14న కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించగా.. కొద్దిరోజుల్లోనే ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని పలుచోట్ల అభ్యర్థులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసం, అల్లర్లపై అధికారుల విచారణ కొనసాగుతోంది. కాగా అగ్నివీర్ తొలి బ్యాచ్‌ను 2022, డిసెంబర్ 11 నాటికి అధికారులు ప్రకటించనున్నారు. ఈ పథకం కింద ఎంపికైన అభ్యర్థులకు నాలుగేళ్ల సర్వీస్ పూర్తయ్యాక 25 శాతం మందిని మరో 15 ఏళ్ల పాటు త్రివిధ దళాల్లోకి తీసుకోనున్నారు.

Exit mobile version