NTV Telugu Site icon

Delhi Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోం

Delhi

Delhi

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత నానాటికీ క్షీణిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400లకు పైగా నమోదైతుంది. ఈ నేపథ్యంలో 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాలుష్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి గోపాల్‌రాయ్‌ తెలిపారు. కాగా, నేడు (బుధవారం) సచివాలయ అధికారులతో సమావేశం నిర్వహించబోతున్నామని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి చెప్పుకొచ్చారు. ఢిల్లీలోని మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. మిగిలిన ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు పని చేయనున్నాయన్నారు. ఇప్పటికే ఒకటి నుంచి 11వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు.

Read Also: Rafael Nadal Retirement: పరాజయంతో కెరీర్‌ను ముగించిన ‘స్పెయిన్ బుల్’!

అయితే, ఢిల్లీలో గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతుండంతో.. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఉదయం గాలి నాణ్యత సూచీ 422గా రికార్డైంది. చాలా ప్రాంతాల్లో ఇది 500 మార్క్‌ను దాటడంతో వాతావరణ శాఖ అధికారులు ఆందోళన పడుతున్నారు. దీని వల్ల ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. కాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టులోని ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్‌ పాల్గొని తమ వాదనలు వినిపించొచ్చని సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సూచించారు. ఇక, వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కోరారు.