Jammu Kashmir: కాశ్మీరీ వేర్పాటువాది మార్వాయిజ్ మౌల్వీ మహ్మద్ ఫరూఖ్ హత్య జరిగిన 33 ఏళ్ల తరువాత, ఈ కేసులో ఇద్దరు హిబ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాదులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వీరి కొసం దశాబ్ధాలుగా దర్యాప్తు సంస్థలు, పోలీసులు వెతుకుతున్నారు. జమ్మూ కాశ్మీర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అరెస్ట్ చేసి వీరిద్దరిని సీబీఐకి అప్పగించినట్లు జమ్మూ కాశ్మీర్ సీఐడీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రష్మీ రంజన్ స్వైన్ అన్నారు.
Read Also: Jama Masjid: జామా మసీద్ మెట్ల కింద ఉన్న హిందూ విగ్రహాలు స్వాధీనం చేసుకోవాలి.. కోర్టులో పిటిషన్
ఇద్దరు హిజ్బుల్ ముజాహీదీన్ ఉగ్రవాదులు జావైద్ అహ్మద్ భట్, జహూర్ అహ్మద్ భట్ లను ఎక్కడ అరెస్ట్ చేశారనే వివరాలను పోలీసులు వెల్లడించలేదు. మే 21, 1990న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల చేతిలో కశ్మీర్ వేర్పాటువాది మిర్వాయిజ్ ఫరూఖ్ హతయ్యాడు. ఈ కేసులో హిజ్బుల్ కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు నిందితులుగా ఉన్నారు. ఈ హత్య కాశ్మీర్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు కారణం అయింది.
నిరసన సమయంలో భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో శ్రీనగర్ లోని హవాల్ లో పదుల సంఖ్యలో నిరసనకారులు మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును సీబీఐ విచారించగా.. నేరస్తులు పారిపోయారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన ఇద్దరూ నేపాల్ ద్వారా పాకిస్తాన్ పారిపోయారు. కొద్ది కాలం తరువాత కాశ్మీర్ తిరిగి వచ్చారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు ఇప్పటికే చనిపోయారు. ఒకరికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. పరారీలో ఉన్న ఇద్దరు ఈ రోజు అరెస్ట్ అయ్యారు.