Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తు్న్నాయి. ఇప్పటికే ఈ ఘటన ఉగ్రవాద దాడిగా కేంద్రం ప్రకటించింది. నిందితులందరికి జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. డాక్టర్లుగా ఉంటూ ఉగ్రవాదులుగా మారిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు బాంబుతో ఆత్మాహుతి చేసుకున్న వ్యక్తిని కాశ్మీర్‌కు చెందిన ఉమర్ నబీగా గుర్తించారు. నిందితుందరికి ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయి.
Read Also: Pakistan: భారత్, ఆఫ్ఘాన్‌లతో యుద్ధానికి సిద్ధం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే, ఈ కేసులో పెద్ద కుట్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. డిసెంబర్ 6, బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజున ప్రతీకారం తీర్చుకునేందుకు దాడులకు పాల్పడాలని ఉగ్రవాదులు భావించారు. దీని కోసం 32 కార్లను కూడా సిద్ధం చేసుకున్నారు. ఆరు దశల్లో ఒకేసారి బాంబు బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేశారు. ఢిల్లీలోని ఆరు వేర్వేరు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు నాలుగు కార్లను గుర్తించారు. ఇవన్నీ పాత కార్లుగా తేలాయి. దాడులకు పాత కార్లను ఉగ్రవాదులు కొనుగోలు చేశారు. బ్రెజ్జా, స్విఫ్ట్, ఎకోస్పోర్ట్ కార్లను పోలీసులు గుర్తించారు. సోమవారం దాడి సమయంలో హ్యుందాయ్ ఐ20కారును ఉపయోగించారు. పోలీసులకు ట్రేస్ చేసినా దొరకుండా ఎక్కువ సార్లు చేతులు మారిన కార్లను ఉగ్ర డాక్టర్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది.
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును పోలీసులు హర్యానా ఫరీదాబాద్‌లో గుర్తించారు. బ్రెజ్జా కారును మహిళా వైద్యురాలు షాహినా సయీద్ వాడినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈమెనే జైషే మహ్మద్ ఉగ్రసంస్థ మహిళా విభాగానికి ఇండియాలో హెడ్‌గా పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. బ్రెజ్జా కారును హర్యానాలోని ఫరీదాబాద్‌లోని అల్-ఫలా స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ క్యాంపస్‌లో గుర్తించారు. ఈ కేసులో ఉగ్రవాద డాక్టర్లు- ఆదిల్ అహ్మద్ రాథర్, ముజమ్మిల్ షకీల్, సాహినా సయీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
