Parliament Monsoon Session: రాజ్యసభలో జరిగిన గందరగోళ పరిస్థితుల మధ్య డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో మరో ముగ్గురు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది. సభను, సభాపతి అధికారాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సభా వెల్‌లోకి ప్రవేశించి, నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారని డిప్యూటీ చైర్మన్ వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభ నుంచి సస్పెండ్ అయిన వారిలో ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ కుమార్ పాఠక్, స్వతంత్ర ఎంపీ అజిత్ కుమార్ భుయాన్ ఉన్నారు. గురువారం రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారనే ఆరోపణలపై ఈ వారం మిగిలిన కాలానికి రాజ్యసభ నుండి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఇప్పటి వరకు 23 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేశారు.
సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలిగించినందుకు మంగళవారం మొత్తం 19 మంది ప్రతిపక్ష ఎంపీలను ఈ వారం మిగిలిన వారం పాటు ఎగువ సభ నుంచి సస్పెండ్ చేశారు. ఎగువ సభలో ఒకే బ్యాచ్ సస్పెన్షన్‌లలో ఇదే అత్యధికం. గత ఏడాది నవంబర్‌లో వ్యవసాయ బిల్లులపై వర్షాకాల సమావేశాల సందర్భంగా వారు సృష్టించిన గందరగోళానికి 12 మంది ప్రతిపక్ష ఎంపీలను శీతాకాల సమావేశమంతా సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన 19 మంది సభ్యుల్లో ఏడుగురు టీఎంసీకి చెందినవారు, ఆరుగురు ఎంపీలు డీఎంకే, ముగ్గురు టీఆర్‌ఎస్, ఇద్దరు సీపీఎం, ఒక సీపీఐకి చెందినవారు. సస్పెండ్ అయిన ఆ 19 మంది సభ్యుల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన బడుగుల లింగయ్య, రవిచంద్ర వద్దిరాజు, దామోదర్‌రావులతో పాటు సుస్మితా దేవ్, శాంతను సేన్, డోలా సేన్, కనిమొళి, మౌసుమ్ నూర్, శాంతా ఛెత్రీ, నదీముల్, రహీమ్, గిరిరాజన్, అభిరంజన్ బిస్వార్, అహ్మద్ అబ్దుల్లా, రహీం, కల్యాణసుందరం, ఎన్.ఆర్.ఇలాంగో, శివదాసన్, సందోష్ కుమార్ ఉన్నారు. అయితే, సస్పెండ్ అయిన సభ్యులు.. సభను వీడకుండా అక్కడే నిరసనకు దిగారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇప్పటివరకు 23 మంది రాజ్యసభ ఎంపీలు, 4 లోక్‌సభ ఎంపీలతో సహా మొత్తం 27 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు.
Voter ID:17 ఏళ్లకే ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈసీ కీలక నిర్ణయం
లోక్‌సభలో సోమవారం నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. అనుచిత ప్రవర్తనతో సభకు ఆటంకం కలిగిస్తున్నారని లోక్‌సభ స్పీకర్ నలుగురు కాంగ్రెస్ ఎంపీలను మొత్తం వర్షాకాల సమావేశాల నుండి సస్పెండ్ చేశారు. మాణిక్కం ఠాగూర్ సహా నలుగురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో మాణిక్కం ఠాగూర్, టీఎన్ ప్రతాపన్, జ్యోతిమణి, రమ్య హరిదాస్‌లు ఉన్నారు.