ఒక మహిళతో పాటు ఆమె 21 ఏళ్ల కుమార్తెను హత్య చేసిన కేసులో టెంట్ హౌస్ యజమానితో పాటు అతని ఇద్దరు సోదరులను ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు సోదరులను ఇర్ఫాన్ (టెంట్ హౌస్ యజమాని), సదన్, షెహజాద్‌లుగా గుర్తించారు. మృతులు శకుంతల (40), ఆమె కుమార్తె విజయలక్ష్మి(21)గా గుర్తించారు. జూన్ 29న తల్లీకూతుళ్లు తమ ఇంట్లో హత్యకు గురయ్యారు. హత్యకు ఉపయోగించిన కొడవలిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కూరగాయల వ్యాపారి అయిన శకుంతల వద్ద రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు లేవని సుల్తాన్‌పూర్ ఎస్పీ సోమెన్ బర్మా సోమవారం తెలిపారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ శకుంతలతో స్నేహంగా ఉంటూ చాలా డబ్బు ఖర్చు చేశాడు. ఆమెను తన లగ్జరీ కారులో ఎక్కించుకుని వెళ్లేవాడు. అప్పుడు ఇర్ఫాన్ ఆమె 21 ఏళ్ల కుమార్తెను చూశాడు. తన కుమార్తెను తన వద్దకు పంపాలని ఇర్ఫాన్ శకుంతలను అడగడంతో.. ఆమె అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కుమార్తె కూడా అతని ప్రతిపాదనను తిరస్కరించింది.ఈ విషయం శకుంతల, ఇర్ఫాన్‌ల మధ్య సంబంధాన్ని కూడా దెబ్బతీసిందని ఎస్పీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ తన ఇద్దరు సోదరులతో కలిసి తల్లీ కూతుళ్లను హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు ఆయన తెలిపారు. జూన్ 29న, ఇర్ఫాన్ తన ఇద్దరు సోదరులతో కలిసి ఆమె భర్త లేని సమయంలో మహిళ నివాసంలోకి ప్రవేశించి, సదన్‌ను బయట కాపలాగా ఉండమని కోరాడు. మిగతా ఇద్దరు లోపలికి వెళ్లి తల్లీకూతుళ్లను కొడవలితో దారుణంగా హత్య చేశారు.
Viral: నడి సముద్రంలో రెండు ముక్కలైన ఓడ… రెస్క్యూ ఆపరేషన్ వైరల్..
విజయలక్ష్మిని తనకిచ్చి పెళ్లి చేయమని శకుంతలను ఒప్పించడానికి ప్రయత్నించినట్లు ఇర్ఫాన్ విచారణలో వెల్లడించాడు. ఆమె చదువుతో అన్ని ఖర్చులు తానే భరిస్తానని కూడా చెప్పానని.. కానీ ఆమె దానికి ఒప్పుకోలేదని ఇర్ఫాన్ పోలీసులకు చెప్పాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తాను ఖర్చు చేసిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసినట్లు చెప్పాడు. అదే గొడవకు దారి తీసిందని.. ఆవేశంతో కొడవలితో ఆమె చంపానని.. తాము పారిపోయే ముందు విజయలక్ష్మిని పట్టుకుని ఆమెను కూడా చంపామన్నారు. ఇర్ఫాన్, శకుంతల మధ్య 500 సార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు ఇర్ఫాన్ కాల్ వివరాలు గమనిస్తే తెలిసినట్లు పోలీసులు వెల్లడించారు.