Site icon NTV Telugu

26/11 Mumbai Attack: ముంబై టెర్రర్ దాడులకు 17 ఏళ్లు.. ఆనాటి హీరోలను ఎలా మరవగలం..

Mumbai Attack

Mumbai Attack

26/11 Mumbai Attack: 26/11 ముంబై దాడులను ఈ దేశం ఎప్పుడూ మరిచిపోదు. ఈ దాడి జరిగి నేటికి 17 ఏళ్లు. లష్కరే తోయిబాకు చెందిన పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత ఆర్థిక రాజధాని ముంబైపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 175 మంది మరణించారు. 166 మంది అమాయకమైన ప్రజలు కాగా, 9 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఒకే ఒక్క టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఇతడిని విచారించగా, పాకిస్తాన్ ప్లాన్ బయటపడింది. ఇండియా న్యాయచట్టాల ప్రకారం, ఇతడికి ఉరిశిక్ష విధించారు. ఈ దాడుల వెనక పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా ఉంది. 2008లో జరిగిన ఈ ఉగ్రదాడుల్లో 20 మంది భద్రతా బలగాలు, 26 మంది విదేశీయులు మరణించిన వారిలో ఉన్నారు. 300 మందికి పైగా గాయపడ్డారు. సముద్ర మార్గం ద్వారా పాకిస్తాన్ నుంచి వచ్చని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.

ఆనాటి హీరోలు వీరే:

తుకారాం ఓంబ్లే:
26/11 నగరంలో జరిగిన ఉగ్రదాడుల సమయంలో మరణించిన ముంబై పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ తుకారాం ఓంబ్లే. నవంబర్ 26, 2008 రాత్రి టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు నిరాయుధుడైన ఓబ్లేని కసబ్ చంపాడు. దక్షిణ ముంబైలోని గిర్గామ్ చౌపటీ వద్ద ఇతడిని కాల్చి చంపారు. కసబ్‌ని పట్టుకోవడంలో తుకారం ఓంబ్లే తన ప్రాణాలను పణంగా పెట్టారు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్:
2008లో ముంబైలో జరిగిన 26/11 దాడుల సమయంలో మేజర్ సందీప్ పాకిస్తాన్ లష్కరే తోయిబా ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ముంబైలోని తాజ్ ప్యాలెస్ హోటల్ నుండి ఉగ్రవాదులను ఎలిమినేట్ చేసే ఆపరేషన్‌లో ప్రాణ త్యాగం చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్‌జీ) కమాండో టీంకి ఉన్ని కృష్ణన్ నాయకత్వం వహించాడు. ఇతడి త్యాగానికి గుర్తుగా 26 జనవరి 2009న దేశ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం అశోక్ చక్ర లభించింది.

హేమంత్ కర్కరే-అశోక్ కామ్టే-విజయ్ సలాస్కర్:
యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ చీఫ్ హేమంత్ కర్కరే, 1982 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, కామా హాస్పిటల్ సమీపంలో ఉగ్రవాదుల ఆకస్మిక దాడిలో ఆయనతో పాటు మరో ఐపీఎస్ అశోక్ కామ్టే, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలాస్కర్ మరణించారు.

మల్లికా జగద్:
26/11 దాడుల సమయంలో తాజ్ ప్యాలెస్ మేనేజర్‌గా ఉన్న మల్లికా జగద్ ఉగ్రవాదుల్ని అతిధులను రక్షించేందుకు వేగంగా చర్యలు తీసుకున్నారు.ఆమె ఒక రూంలో తలుపులు మూసేసి, లైట్లు ఆర్పేసి, అందర్ని నిశ్శబ్ధంగా ఉండాలని కోరారు. అతిధులు అంతా ప్రశాంతంగా ఉండేందుకు మల్లికా సహకరించారు. సైన్యం వచ్చే వరకు ఆమె అందర్ని ప్రశాంతంగా ఉంచింది.

కరంబీర్ సింగ్ కాంగ్:
26/11 దాడుల సమయంలో ముంబైలోని తాజ్ హోటల్ జనరల్ మేనేజర్, కరంబీర్ కాంగ్, అతని భార్య, కుమారులు లోపల చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినప్పుడు వ్యక్తిగత విషాదాన్ని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ప్రతీ ఒక్కరిని రక్షించడానికి సిబ్బందికి, భద్రతా బలగాలకు సాయం చేయడానికి అతను పగలు రాత్రి పనిచేస్తూనే ఉన్నారు. వందల మందిని రక్షించారు.

థామస్ వర్గీస్:
తాజ్ వాసబి రెస్టారెంట్ సీనియర్ వెయిటర్ థామస్ వర్గీస్ 26/11 దాడుల్లో నిజమైన హీరోగా నిలిచారు. కాల్పులు ప్రారంభమైన తర్వాత కస్టమర్లను కిందకు వంగి ఉండాలని కోరారు. రెస్టారెంట్ నుంచి అందర్ని సురక్షితంగా పంపించేసి, తానను చివరకుగా రెస్టారెంట్‌ నుంచి బయటకు వచ్చారు. ఇలా బయటకు వచ్చే క్రమంలో టెర్రిస్టులు అతడిని చూసి కాల్చి చంపారు. ఎంతో మంది కోసం అతను ప్రాణాలు అర్పించి హీరోగా నిలిచారు.

Exit mobile version