Sadanand Date: మహారాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ వాసంత్ దాతే నియమితులయ్యారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడిన పోలీస్ అధికారిగా దాతేకు పేరుంది. 1990 బ్యాచ్‌కు చెందిన 59 ఏళ్ల దాతే, జనవరి 3న పదవీ విమరణ చేయనున్న రష్మీ శుక్లా స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. మహారాష్ట్రలో 2 లక్షలకు పైగా ఉన్న పోలీస్ దళానికి అధిపతి కానున్నారు. ఆయన రెండేళ్ల పాటు డీజీపీగా సేవలందించనున్నారు. ఇటీవల కేంద్ర డిప్యూటేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, దాతేను అత్యున్నత పదవి వరించింది. అంతకుముందు ఆయన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) చీఫ్‌గా పనిచేశారు.
Read Also: Arjun Tendulkar: 8 ఓవర్లలో 78 పరుగులు.. అర్జున్ టెండూల్కర్‌కు ఐపీఎల్ కూడా కష్టమేనా?
2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో, అప్పటి అడిషనల్ కమిషనర్‌గా ఉన్న దాతే కామా ఆస్పత్రి వద్ద ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబూ ఇస్మాయిల్‌ను ఎదుర్కొన్నారు. గ్రెనేడ్ ముక్కలు తగిలి తీవ్రంగా గాయపడినప్పటికీ, విరోచితంగా పోరాడారు. ఈ వీరత్వానికి గానూ ఆయనకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ లభించింది. ఇప్పటికీ ఆయన శరీరంలో, ముఖ్యంగా కంటి సమీపంలో గ్రెనేడ్ పేలుడులోని లోహపు ముక్కలు ఉన్నాయి. వీటిని గాయాలుగా కాకుండా యుద్ధంలో లభించిన పతకాలుగా భావిస్తానని గతంలో ఆయన అన్నారు.
మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)లో, మీరా-భయందర్, వసాయి-విరార్‌కు మొదటి పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. దాతే ముంబై పోలీసులో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (శాంతిభద్రతలు)- క్రైమ్ విభాగంలో కూడా పనిచేశారు.ఆయన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో డీఐజీగా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)లో ఐజీ (ఆపరేషన్స్)గా కూడా పనిచేశారు. పూణే విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక నేరాలలో డాక్టరేట్ పొందిన సదానంద్ దాతే, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న ఈ కీలక సమయంలో మహారాష్ట్ర డీజీపీగా బాధ్యతలు తీసుకోనున్నారు.
