Site icon NTV Telugu

Shocking Incident: రేబిస్‌ సోకిన గేదె పాలతో చేసిన రైతా.. తిన్న 200 మంది

Untitled Design (1)

Untitled Design (1)

యూపీలోని పిప్రౌలి గ్రామంలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలో నిర్వహించిన ఒక అంత్యక్రియల అనంతరం ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో వడ్డించిన రైతాను సుమారు 200 మంది గ్రామస్తులు తిన్నారు. అయితే ఆ రైతా రేబిస్‌ సోకిన గేదె పాలతో తయారైనదని విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ ఘటన సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే, పిప్రౌలి గ్రామానికి చెందిన ఓ రైతు పెంచుతున్న గేదె నుంచి సేకరించిన పాలతో పెరుగు తయారు చేసి రైతా సిద్ధం చేశారు. ఆ రైతాను అంత్యక్రియల సందర్భంగా గ్రామస్తులకు వడ్డించారు. అయితే కొద్ది రోజులకే ఆ గేదె రేబిస్‌ సోకి మృతి చెందడంతో అసలు విషయం బయటపడింది. ఈ సమాచారం అధికారులకు చేరడంతో వెంటనే అప్రమత్తమైన వైద్య శాఖ చర్యలు చేపట్టింది.

ఆ భోజన కార్యక్రమంలో రైతా తిన్న వారందరినీ గుర్తించిన వైద్య అధికారులు సుమారు 200 మందికి యాంటీ-రేబిస్‌ వ్యాక్సిన్‌ను అందించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొనగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి వైద్య శాఖతో పాటు పశువైద్య శాఖ సమన్వయంతో చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా, రేబిస్‌ సోకిన గేదెను పెంచిన రైతుపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Exit mobile version