జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. వరసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లలో ఉగ్రవాదులను లేపేస్తున్నాయి భద్రతా బలగాలు. ఇటీవల కాలంలో దాదాపుగా రోజు ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా కాశ్మీర్ లోని బెమీనా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి బలగాలు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులను నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఒక పోలీసుకు స్వల్పగాయాలయ్యాయి.
గతంలో సోపోర్ ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులుగా వీరిని పోలీసులు గుర్తించారు. తప్పించుకున్నప్పటి నుంచి వీరి కదలికలను భద్రతా బలగాలు ట్రాక్ చేస్తున్నాయి. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో వీరిని మట్టుపెట్టాయి. పోలీస్ అధికారులు ఈ ఎన్ కౌంటర్ ను పెద్ద విజయంగా పేర్కొన్నారు. గతంలో అమర్ నాథ్ యాత్రపై దాడి చేయాలనే ఉద్దేశ్యంలో 2018లో ఆదిల్ హుస్సేన్ మీర్ అనే ఉగ్రవాది వాఘా బోర్డర్ ద్వారా పాక్ వెళ్లాడు. అయితే తాజా ఎన్ కౌంటర్ లో ఆదిల్ హుస్సేన్ మీర్ తో పాటు అబ్దుల్లా గౌజ్రీ అనే ఉగ్రవాదిని పోలీసులు మట్టుపెట్టారు. గౌజ్రీ పాకిస్తాన్ లోని ఫైసలాబాద్ కు చెందిన వ్యక్తి కాగా.. ఆదిల్ హుస్సేన్ మీర్ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాకు చెందిన వాడు. పాక్ కు చెందిన టెర్రరిస్ట్ హ్యాండర్లు ఈ ఇద్దరిని కాశ్మీర్ కు పంపారని కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూ కాశ్మీర్ లో మొత్తం 100 మంది ఉగ్రవాదులను మట్టు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 63 మంది లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారు కాగా.. 24 మంది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు. అయితే మరణించిన ఉగ్రవాదుల్లో 29 మంది పాకిస్తాన్ కు చెందిన వారిగా అధికారులు వెల్లడించారు.
