Site icon NTV Telugu

Kerala: గూగుల్ మ్యాప్స్‌ని నమ్మిపోతే.. కారు నదిలో మునిగి ఇద్దరు డాక్టర్లు మృతి

Kerala

Kerala

Kerala: గూగుల్ మ్యాప్స్, జీపీఎస్‌ని నమ్మిపోతే ఇద్దరు యువ డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. కారు నదిలో మునిగిపోయి ప్రమాదం జరిగింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. కొల్లాంకు చెందిన డాక్టర్ అద్వైత్(29), త్రిసూర్‌కి చెందిన డాక్టర్ అజ్మల్(29) జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రిలో విధులు ముగించుకుని కొడుంగల్లూరు నుంచి ఇళ్లకు బయలుదేరారు. వీరితో పాటు మరో ముగ్గరు డాక్టర్లు తబ్సిర్, తమన్నా, నర్స్ జిస్మాన్ కూడా ఉన్నారు.

హోండా సివిక్ కారులో ఐదుగురు వెళ్తున్నారు. మరసటి రోజు అద్వైడ్ పుట్టిన రోజు ఉండటంతో వీరంతా కలిసి షాపింగ్ చేసి తిరుగు ప్రయాణమయ్యారు. కారును అతనే డ్రైవ్ చేస్తున్నాడు. అయితే భారీ వర్షం పడటంతో రోడ్డు సరిగా కనిపించకపోవడంతో గూగుల్ మ్యాప్స్ ని అనుసరించి కారును నడిపారు. ఈ క్రమంలోనే రోడ్డుపై నీరు నిలిచి ఉందని భావించి అద్వైత్ కారుని పెరియార్ నదిలోకి పోనిచ్చాడు. కారు నదిలోకి వెళ్లిందని గ్రహించే లోపే మునిగిపోయింది.

Read Also: Revanth Reddy: మోడీ అలా చేశారు కాబట్టే.. సభకు రాజగోపాల్, వివేక్, విజయశాంతి హాజరు కాలేదు

ఈ ప్రమాదం అర్ధరాత్రి 12.30 గంటలకు జరిగింది. అద్వైత్, అజ్మల్ కారుతోనే మునిగిపోయారు. మిగిలిన ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్, పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను వెలికితీసేందుకు స్కూబా డైవర్లను ఘటన స్థలానికి పంపారు. స్థానికులు కారులోని ముగ్గురిని రక్షించారు.

భారీ వర్షం కురుస్తుండటంతో రోడ్డు సరిగా కనిపించకపోవడంతో గూగుల్ మ్యాప్స్‌ని అనుసరించి వెళ్తున్నట్లు ప్రమాదం నుంచి బయటపడిన తమన్నా చెప్పారు. అయితే మ్యాప్ చూపించిన విధంగా కుడివైపుకు మలుపు తీసుకోకుండా, ఎడమ వైపు వెళ్లి పొరపాటున నదిలో పడిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version