NTV Telugu Site icon

Child Deaths: మహారాష్ట్రలో కలకలం రేపుతున్న చిన్నారుల మరణాలు.. 3 నెలల్లో 179 మంది మృతి

Child Deaths

Child Deaths

Child Deaths: మహారాష్ట్రలో చిన్నారుల మరణాలు కలకలం రేపుతున్నాయి. నందుర్‌బార్ లోని సివిల్ ఆస్పత్రిలో గత మూడు నెలల్లో 179 మంది చిన్నారులు మరణించారు. ఈ ఉదంతంపై నందుర్‌బార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సావన్ కుమార్ స్పందించారు. పిల్లల మరణాలకు అనేక ఆరోగ్య సమస్యలు కారణమవుతున్నాయని వెల్లడించారు.

తక్కువ బరువుతో పుట్టడం, పుట్టుకలో వచ్చే అస్పిక్సియా, సెప్సిస్, శ్వాసకోశ వ్యాధులు ప్రాథమిక కారణాలని వైద్యాధికారులు తెలిపారు. నందుర్‌బార్ జిల్లాలో జూలై నెలలో 75 మంది, ఆగస్టులో 86 మంది, సెప్టెంబర్ లో 18 మంది మొత్తంగా మూడు నెలల్లో 179 మంది మరణించారు. మరణాల్లో 70 శాతం పిల్లలు పుట్టిన 0-28 రోజుల మధ్య వయసులో సంభవించాయి. మహారాష్ట్రలో ఇతర జిల్లాలతో పోలిస్తే ఈ నందుర్‌బార్ జిల్లాలో గణనీయంగా గిరిజన జనాభా ఉంది. ఇక్కడి స్రీలల్లో సీకెల్ సెల్ ఎనీమియా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Read Also: Tamil Nadu: కులం అడ్డుగోడలు ఛేదించారు.. తొలిసారి ఆలయ పూజారులుగా ముగ్గురు మహిళలు..

ఈ ప్రాంతంలో రాష్ట్రంలో అత్యధిక పోషకాహార లోపం ఉందని వైద్యులు తెలిపారు. మరణాల్లో 20 శాతం సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల సంభవిస్తున్నాయని వైద్యసౌకర్యాలు సరిగా లేకపోవడం, ఇంటి దగ్గర ప్రసవాలు చేయడం, సామూహిక వలసలు కూడా ప్రధాన కారణంగా ఉన్నాయని సావన్ కుమార్ తెలిపారు. ఈ సవాళ్లను అధిగమించి పసివాళ్ల ప్రాణాలు కాపాాడాల్సి ఉందన్నారు.

దీని కోసం నందుర్‌బార్ జిల్లాలో అధికారులు ‘మిషన్ లక్ష్య 84’ పేరుతో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిశువుల మరణాలకు కారణాలను పరిష్కరించడంతో పాటు, ఆరోగ్య సేవల్ని మెరుగుపరచడం, శిశువుల ఆరోగ్యానికి మెరుగైన సౌకర్యాలు కల్పించేలా లక్ష్యం పెట్టుకున్నారు. ప్రసవానికి 42 రోజుల ముందు, ప్రసవం తర్వాత 42 రోజులు రక్షణ చర్యలు తీసుకుంటున్నామని వైద్యాధికారులు తెలిపారు. ఈ మరణాలపై స్థానిక ఎమ్మెల్యే అంషా పద్వీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశువుల మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.