NTV Telugu Site icon

Maha Kumbh Mela: కుంభమేళాలో మరో రికార్డ్! చీపురుపట్టిన 15 వేల మంది కార్మికులు

Up

Up

మహా కుంభమేళా మరో రికార్డ్ సృష్టించబోతుంది. ఇప్పటికే 60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేసి రికార్డ్ సృష్టించగా.. తాజాగా ఒకేసారి 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ డ్రైవ్ చేపట్టారు. ఈ పరిణామం గిన్నిస్ రికార్డ్ దిశగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతంలో నాలుగు జోన్‌ల్లో కార్మికులు క్లీన్ డ్రైవ్ చేపట్టారు. ఒకేసారి 15,000 మంది పారిశుధ్య కార్మికులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పడానికి ప్రయత్నించారు. అయితే ఈ రికార్డు యొక్క తుది ఫలితాలను ఫిబ్రవరి 27న ప్రకటించే అవకాశం ఉంది. పారిశుధ్య కార్మికులను వారి రిస్ట్‌బ్యాండ్‌లపై ఉన్న కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లెక్కించారు.

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు, ప్రయాగ్‌రాజ్‌ మేయర్‌ గణేశ్‌ కేసర్వాని, మహాకుంభమేళా ప్రత్యేక ఈవో ఆకాంక్ష రాణా పర్యవేక్షించారు. రికార్డుకు సంబంధించిన తుది నివేదిక మూడు రోజుల్లో వెలువడనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 2019లో కూడా ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకున్నారు.

ఇదిలా ఉంటే మహా కుంభమేళా జనవరి 13న మొదలుకాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇప్పటి వరకు 60 కోట్లకు మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు యోగి ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినం కావడంతో భక్తుల రాక మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.