Pakistan: సిక్కు మత స్థాపకుడు గురునానక్ 556వ జయంతి సందర్భంగా భారత్‌లోని సిక్కు మతస్తులు ఆయన జన్మస్థలం అయిన పాకిస్తాన్ లోని నంకనా సాహిబ్‌కు వెళ్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత, పాకిస్తాన్‌కు భారతీయులు వెళ్లడం ఇదే తొలిసారి. అయితే, ఇలా వెళ్లే వారిలో 14 మందిని పాకిస్తాన్ అధికారులు ముందుగా వారి దేశంలోకి అనుమతించి, ఆ తర్వాత తిప్పి పంపించారు. ‘‘మీరు సిక్కులు కాదు, హిందువులు’’ అంటూ పాక్ అధికారులు వారి దేశంలోకి అనుమతించలేదు.
Read Also: Dies Irae: తెలుగులోకి మలయాళ హిట్ హారర్ సినిమా
ఈ 14 మంది కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ సందర్శించేందుకు అనుమతించిన దాదాపు 2100 మంది సభ్యుల్లో భాగం. వీరికి కూడా ముందుగా ఇస్లామాబాద్ ప్రయాణ పత్రాలను జారీ చేసింది. మంగళవారం నాడు వాఘా సరిహద్దు క్రాసింగ్ ద్వారా 1900 మంది పాకిస్తాన్ లోకి ప్రవేశించినట్లు అంచనా. 14 మంది హిందూ యాత్రికులు, పాకిస్తాన్‌లో జన్మించిన సింధీలు. వీరు భారత పౌరసత్వం పొందారు. పాకిస్తాన్‌లోని తమ బంధువుల్ని కలవడానికి వెళ్తున్న సమయంలో పాకిస్తాన్ వీరిని అనుమతించలేదు.
14 మందిలో ఢిల్లీ, లక్నోకు చెందిన వారు ఉన్నారు. పాక్ అధికారులు తమ రికార్డుల్లో ఉన్న సిక్కులను మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో వీరంతా వెనుదిరిగారు. స్వతంత్రంగా వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న 300 మందిని అవసరమైన హోం మంత్రిత్వ శాఖ అనుమతి లేకపోవడంతో భారత్ వైపు తిప్పి పంపారు. బుధవారం రోజు లాహోర్‌కు 80 కి.మీ దూరంలో ఉన్న గురుద్వారా జనమస్థాన్ లో ప్రధాన వేడుక జరుగుతుంది.
