NTV Telugu Site icon

Mumbai: ఘోర విషాదం.. బోటు ప్రమాదంలో 13 మంది దుర్మరణం

Mahacm

Mahacm

ఆహ్లాదం.. విషాదమైంది. ఆనందం.. ఊపిరి తీసింది. ఎంతో ఉల్లాసంగా సాగిపోతున్న ప్రయాణంలో ఒకే ఒక్క కుదుపు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ముంబై తీరంలో బుధవారం జరిగిన బోటు ప్రమాదంలో 13 మంది జలసమాధి అయ్యారు. ఈ దుర్ఘటనతో తీరం దు:ఖ సముద్రం అయింది.

బుధవారం ముంబై తీరంలో పర్యాటకులు ఫెర్రీ బోటులో విహరిస్తున్నారు. ఎంతో ఉల్లాసంగా ప్రయాణం సాగిపోతుంది. కేరింతలు కొడుతూ.. కబుర్లు చెప్పుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా సాగిపోతుంది. అదే తీరంలో విహరిస్తున్న ఓ స్పీడు బోటు.. మృత్యువులా దూసుకొచ్చి ఢీకొట్టింది. సెక్షన్లలో బోటు మునిగిపోయింది. రక్షించే లైఫ్ జాకెట్లు.. హ్యాండిచ్చాయి. అలా 13 మంది ప్రయాణికులు తీరంలోనే జలసమాధి అయిపోయిరు. ఈ ప్రమాదంతో టూరిస్టులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బోటు ప్రమాదంలో 13 మంది చనిపోయారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు.

ముంబైలోని ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ నుంచి ఎలిఫెంటా గుహలకు ఫెర్రీ బోటు 110 మంది ప్రయాణికులతో వెళ్తోంది. అయితే అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఓ స్పీడ్‌బోటు ఢీకొట్టింది. దీంతో ఫెర్రీ మునగడం ప్రారంభించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. మరికొందరు ప్రాణభయంతో బెంబేలెత్తిపోయారు. మరికొందరు షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. పోర్టు అధికారులు, కోస్ట్‌గార్డ్‌, మత్స్యకారుల సహాయంతో వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఫెర్రీలో దాదాపు సిబ్బందితో పాటు 110 మంది ప్రయాణికులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే స్పీడ్‌బోటు వేగంగా ఢీకొట్టిన దృశ్యాలు.. మొబైల్‌లో రికార్డ్ అయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియలో వైరల్అవుతున్నాయి.

ఫడ్నవిస్..
బోటు ప్రమాదం బుధవారం మధ్యాహ్నం 3:55 నిమిషాలకు జరిగిందని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు.101 మందిని సురక్షితంగా రక్షించారని చెప్పారు. 13 మంది మరణించారని వెల్లడించారు. 13 మందిలో ముగ్గురు నేవీ సిబ్బందితో సహా 10 మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు. 11 క్రాఫ్ట్‌లు మరియు 4 హెలికాప్టర్‌లను ఉపయోగించి, నేవీ, కోస్ట్ గార్డ్, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారన్నారు. గల్లంతైన సమాచారం ఉదయానికి తెలుస్తుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కొక్కరికి రూ.5 లక్షల సాయం ప్రకటించారు. ఈ ప్రమాదంపై నేవీ దర్యాప్తు చేస్తుందని తెలిపారు.