Arunachal Pradesh: బంగ్లాదేశీయు అక్రమ చొరబాట్లపై అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు తిరగబడుతున్నారు. రాష్ట్రంలోని ఒక మసీదును తొలగించడంతో పాటు అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు స్థానిక సంస్థలు మంగళవారం రాజధాని ఇటానగర్ ప్రాంతంలో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. నహర్లగున్‌లోని క్యాపిటల్ జామా మసీదు తొలగింపు, క్యాపిటల్ రీజియన్‌లో వారపు మార్కెట్లపై పూర్తి నిషేధం విధించడం, అక్రమ బంగ్లాదేశ్ వలసదారులుగా చెప్పుకునే వ్యక్తులను బహిష్కరించడం అనే మూడు ప్రధాన డిమాండ్లపై అరుణాచల్‌లోని ఇండిజీనస్ యూత్ ఫోర్స్ (IYFA), అరుణాచల్ ప్రదేశ్ ఇండిజీనస్ యూత్ ఆర్గనైజేషన్ (APIYO), ఆల్ నహర్లగున్ యూత్ ఆర్గనైజేషన్ (ANYO) సంయుక్తంగా ఈ బంద్‌ను ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో శాంతిభద్రతల కోసం భారీగా పోలీసుల్ని మోహరించారు. చట్టాన్ని చేతులోకి తీసుకోవద్దని ఐజీపీ కోరుతున్నారు. అక్టోబర్ 6 నుంచి తన సమస్యల్ని లేవనెత్తుతున్నామని, కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని APIYO అధ్యక్షుడు తారో సోనమ్ లియాక్ అన్నారు. సీఎం కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ ఆఫీసుల్లో తమ డిమాండ్లను సమర్పించామని, కానీ ఎలాంటి స్పందన రాలేదని వారు చెప్పారు.
