NTV Telugu Site icon

Team India rally effect: ముంబైలో భారీగా చెత్త.. శుభ్రం చేయడానికి కార్మికులకు ఇక్కట్లు

Mumbai

Mumbai

ముంబై మున్సిపల్ కార్మికులకు గురువారం రాత్రి నుంచి చుక్కలు కనిపించాయి. నగరంలో ఎన్నడూ చూడని చెత్తను చూసి వర్కర్స్ అవాక్కయ్యారు. కొన్ని గంటల పాటు వేల కిలోల వ్యర్థాలు సేకరించి రికార్డు సృష్టించారు.

టీమిండియా క్రికెటర్లు ఇటీవలే టీ 20 వరల్డ్ కప్ గెలుచుకున్నారు. గురువారం క్రికెటర్లంతా ముంబై చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో భారీ స్వాగతం లభించింది. అనంతరం అక్కడ నుంచి స్టేడియం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇందుకోసం ముంబై నగరమంతా కదిలివచ్చింది. అభిమానులు, ప్రజలు ఊహించని రీతిలో తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలనంతగా మెరైన్‌కు జనం వచ్చారు. దీంతో నగర వీధులన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి.

అయితే టీమిండియా క్రికెటర్లకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలు.. తినేందుకు తెచ్చుకున్న స్నాక్స్, కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఆయా పదార్థాలకు సంబంధించిన వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేశారు. దీంతో ముంబై ప్రధాన రహదారులన్నీ చెత్తాచెదారంతో నిండిపోయాయి. ర్యాలీ ముగిశాక రోడ్లు చూస్తే.. ఎటు చూసినా వ్యర్థాలతో రోడ్లు నిండిపోయాయి. పరిస్థితుల్ని చూసిన కార్మికులు షాక్ అయ్యారు. ఇక 100 మంది కార్మికులు శుభ్రం చేయడానికి రంగంలోకి దిగారు. అర్ధరాత్రి 11:30కి క్లీన్ చేయడం మొదలు పెడితే ఏకధాటిగా పని చేస్తే శుక్రవారం ఉదయం 8 గంటలకు పూర్తయ్యాయి. మొత్తం వ్యర్థాలను తూకం వేస్తే 11,500 కిలోల వ్యర్థాలు వచ్చాయి. చెత్తలో ప్లాస్టిక్ సీసాలు, చిప్స్ ప్యాకెట్లు, టీ కప్పులు, చిత్తు కాగితాలు, బట్టలు, బూట్లు, చెప్పులు, ఇలా రకరకాలైన వస్తువులు దర్శనమిచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.