Site icon NTV Telugu

Spying: పాకిస్తాన్ కోసం “గూఢచర్యం” చేస్తూ పట్టుబడిన 11 మంది.. వీరికి ఎలాంటి శిక్షలు ఉంటాయి..?

Pak Spy

Pak Spy

Spying: పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో సహా 11 మది పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. పాక్ ఐఎస్ఐ డబ్బు కోసం వీరంతా భారత సమాచారాన్ని పాకిస్తాన్‌కి చేరవేస్తున్నారు. ఇందులో జ్యోతి మల్హోత్రా విషయం కీలకంగా మారింది. ఆమెకు ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని, భారత్ చేత బహిష్కరించబడిన డానిష్ అనే వ్యక్తితో సంబంధాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇతడి సహకారంతోనే పాకిస్తాన్‌కి మూడుసార్లు వెళ్లి వచ్చింది. దీంతో పాటు మరో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, భారత ఏజెంట్లను గుర్తించేందుకు జ్యోతి మల్హోత్రాను పాక్ వాడుకున్నట్లు తెలుస్తోంది.

పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ వరకు గూఢచార నెట్వర్క్ విస్తరించింది. ప్రస్తుతం అరెస్టైన నిందితులు పాకిస్తాన్ హ్యాండర్లతో సంప్రదింపులు జరిపినట్లు, భారత సైన్యానికి సంబంధించిన సమాచారంతో పాటు ఇతర సున్నిత సమాచారం పాకిస్తాన్‌కి అందించారే ఆరోపణల్ని వీరంతా ఎదుర్కొంటున్నారు. అయితే, వీరికి ఎలాంటి శిక్షలు పడుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అధికారిక రహస్యాల చట్టం ప్రకారం, గూఢచర్యం నేరం. ఉల్లంఘనలకు తీవ్రమైన శిక్షలు విధించవచ్చు. నేరం తీవ్రతను బట్టి మూడు నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు విధించబడుతాయి.

అధికారిక రహస్యాల చట్టం ఏమిటి..?

బ్రిటీష్ కాలం నాటి ఈ చట్టం గూఢచర్యాన్ని ఎదుర్కోవడానికి, జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని రక్షించడానికి రూపొందించబడింది. భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించే విదేశీ శక్తులకు సమాచార లీకేజీని నిరోధించడంతో ఈ చట్టం లక్ష్యం. ఇది భారతీయ పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులతో సహా అందరికి వర్తిస్తుంది. అధికారిక రహస్యాలు, కోడ్‌లు, పాస్‌వర్డ్‌లు, స్కెచ్‌లు, ప్రణాళికలు వంటి వాటిని లీక్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తారు. ముఖ్యంగా, ఈ చట్టం ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఉద్దేశపూర్వకంగా నేరం చేయకపోయినా, దేశ భద్రతకు హాని కలిగించే ఉద్దేశ్యం లేకపోయినా నేరం మోపబడుతుంది.

చట్టం ఏం చెబుతుంది, శిక్షలు ఏంటి..?

సెక్షన్ 3: దేశానికి హాని కలిగించే ఉద్దేశ్యంతో నిషేధిత ప్రదేశాలు, ఉదాహరణ సైనిక స్థావరాలు, ఆయుధశాలలు వంటి వాటిలోకి ప్రవేశించడం, తనిఖీ చేయడం వంటివి నేరంగా పరిగణించబడుతాయి.

శత్రువుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగపడే స్కెచ్‌లు, ప్రణాళికలు, నమూనాలు లేదా గమనికలను తయారు చేయడం. శత్రువుకు ప్రయోజనం చేకూర్చే రహస్య అధికారిక కోడ్‌లు, పాస్‌వర్డ్‌లు, పత్రాలు లేదా సమాచారాన్ని పొందడం, సేకరించడం, రికార్డ్ చేయడం, ప్రచురించడం లేదా కమ్యూనికేట్ చేయడం లేదా వాటి బహిర్గతం భారతదేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను లేదా ఇతర దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే సమాచారాన్ని పొందడం, సేకరించడం, రికార్డ్ చేయడం, ప్రచురించడం లేదా కమ్యూనికేట్ చేయడం నేరంగా పరిగణించబడుతుంది.

సెక్షన్ 5: రహస్య అధికారిక సమాచారాన్ని అనధికార వ్యక్తులకు తెలియజేయడం.
* అటువంటి సమాచారాన్ని విదేశీ శక్తుల ప్రయోజనం కోసం లేదా రాష్ట్ర భద్రతకు హాని కలిగించే విధంగా ఉపయోగించడం.
* అధికారం లేకుండా అధికారిక పత్రాలు లేదా సమాచారాన్ని నిలుపుకోవడం.
* క్లాసిఫైడ్ మెటీరియల్‌ని తిరిగి ఇవ్వడం లేదా పారవేయడం గురించి చట్టబద్ధమైన ఆదేశాలను పాటించడంలో విఫలమైంది.
* అదనంగా, చట్టాన్ని ఉల్లంఘించి సమాచారం తెలిసిన ఎవరైనా కూడా ఈ సెక్షన్ కింద దోషిగా పరిగణించబడతారు.

బీఎన్ఎస్ సెక్షన్ 152: ఈ సెక్షన్ ఉద్దేశపూర్వకంగా విభజన, సాయుధ తిరుగుబాటును లేదా విధ్వంసకరమైన కార్యకలాపాలను ప్రేరేపించడం, ప్రేరేపించే వ్యక్తులకు ఈ చట్టం వర్తిస్తుంది.

*వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే లేదా భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత లేదా సమగ్రతకు హాని కలిగించే వారు ఈ సెక్షన్ కింద కఠినమైన శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది.

శిక్షలు: సెక్షన్ 3 కింద రక్షణ సంస్థలు, ఆయుధశాలలు లేదా సైనిక విషయాలకు సంబంధించిన నేరం అయితే, 14 ఏళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఇతర సందర్భాల్లో జైలు శిక్ష మూడు సంవత్సరాలు ఉంటుంది.

సెక్షన్ 5 కింద 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ ఉండవచ్చు.

భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) సెక్షన్ 152 కింద జీవిత ఖైదు లేదా జరిమానాతో పాటు 7 ఏళ్లు జైలు శిక్ష ఉంటుంది.

Exit mobile version