Uttarakhand: గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 100కు పైగా రోడ్లు మూసుకుపోయాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించబడింది. ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. చంపావత్, అల్మోరా, పితోరాఘర్, ఉధంసింగ్ నగర్, కుమావోన్‌లతో పాటు అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ అంచనా వేసింది. డెహ్రాడూన్, పౌరీ, తెహ్రీ, హరిద్వార్‌లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Read Also: Thief Letter : చిలిపి దొంగ.. అమ్మకు బాగాలేదు, లవర్ పుట్టిన రోజు అంటూ లెటర్ పెట్టి ఏకంగా..?
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గంగా, అలకనంద, భాగీరథి, శారద, మందాకిని, కోసి నదుల్లో నీటిమట్టం పెరగడంతో 100కు పైగా రహదారులు మూసుకుపోయాయి. గడిచిన 24 గంటల్లో అల్మోరాలోని చౌఖుటియాలో 72.5, భన్సియాచానాలో 62, లోహాఘాట్‌లో 59, చంపావత్‌లో 45, కాశీపూర్‌లో 42, భీమ్‌తాల్‌లో 38, హల్ద్వానీలో 31, చమోలీలో 26 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రుద్రప్రయాగ్ జిల్లాలో అలకనంద నది ఉప్పొంగడంతో 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది. నీటి ఎద్దడి కారణంగా లోతట్టు ప్రాంతాలకు లేదా నదీ తీరాలకు వెళ్లవద్దని వాతావరణ, విపత్తు నిర్వహణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
పౌరీ, నైనిటాల్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వేతర పాఠశాలలు మూసివేయబడ్డాయి. విపత్తు సంభవించినప్పుడు తక్షణమే రక్షించడానికి సిద్ధంగా ఉండాలని జిల్లా మేజిస్ట్రేట్‌లకు సూచించబడింది. విపత్తు నిర్వహణ శాఖలతో పాటు జాతీయ విపత్తు రెస్క్యూ ఫోర్స్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గంగ, సరయూ ప్రమాదకర స్థాయికి కొన్ని మీటర్ల దిగువన ప్రవహిస్తుండగా అలకనంద, మందకాని, భాగీరథి నదులు ప్రమాద స్థాయిని దాటాయి. గోమతి, కాళీ, గౌరీ, శారదా నదుల నీటిమట్టం కూడా పెరుగుతోంది. బద్రీనాథ్ జాతీయ రహదారిపై పీపాల్ కోఠి సమీపంలోని పాగల్ నల్, మాల్వాకు వెళ్లే రహదారి కొండచరియలు విరిగిపడటంతో మూసుకుపోయింది. యమునోత్రి హైవే, ధార్చుల, తవా ఘాట్ జాతీయ రహదారిపై కూడా రోడ్లు మూసుకుపోయాయి.