NTV Telugu Site icon

Gujarat: ముదిరిన “దర్గా” వివాదం.. పోలీస్ స్టేషన్‌పై ఓ వర్గం రాళ్ల దాడి.. ఒకరు మృతి

Junagadh Vilence

Junagadh Vilence

Gujarat: గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ అట్టుడుకుతోంది. దర్గా వివాదంతో ఓ వర్గం ప్రజలు దాదాపుగా 500-600 మంది స్థానిక పోలీస్ స్టేషన్ పై దాడికి తెగబడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో ఒకరు మరణించగా.. దాదాపుగా 5 మంది పోలీసులు గాయపడ్దారు. జునాగఢ్ మజేవాడి దర్వాజా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆక్రమణలను తొలగించేందుకు స్థానికంగా అక్రమంగా నిర్మించిన దర్గాను తొలగించాలని పట్ణణ పరిపాలనాధికారులు నిర్ణయించారు. దీంతో ఓ వర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. వాహనాలను తగలబెట్టారు. అల్లర్లను అణిచివేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి లాఠీచార్జ్ చేవారు. ఘటనలో పాల్గొన్న 174 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Ramcharan-Upasana : పుట్టబోయే బిడ్డకు చిరు కానుక ఇచ్చిన ప్రజ్వలా ఫౌండేషన్…!!

ఈ దాడిలో ఓ వ్యక్తి రాళ్లు తగిలి మరణించారని పోలీసులు అనుమానిస్తున్నారు. గుంపు విసిరిన రాళ్ల వల్లే మరణించి ఉండవచ్చని, పోస్టుమార్టం నివేదికత తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. మజేవాడి దర్వాజా సమీపంలోని ఒక మసీదు భూమికి సంబంధించి పత్రాలను సమర్పించాలని జునాగఢ్ మునిసిపల్ కార్పరేషన్ జూన్ 14 నోటీసులు జారీ చేసింది. దీంతో 500-600 మంది ప్రజలు సదరు నిర్మాణం వద్ద గుమిగూడి శుక్రవారం రాత్రి రోడ్లను దిగ్భందించారని ఎస్పీ రవితేజ వాసంశెట్టి తెలిపారు.

జునాగఢ్ డిప్యూటీ ఎస్పీ, ఇతర సిబ్బంది ఆందోళన చెస్తున్న ప్రజలు ఒప్పించేందుకు ప్రయత్నించారు. శాంతి స్థాపనే లక్ష్యంగా దాదాపు గంట పాటు చర్చల తరువాత రాత్రి 10.15 గంటల సమయంలో పోలీస్ సిబ్బందిపై రాళ్లు రువ్వారు. జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో జునాగఢ్ డివైఎస్పీ, ముగ్గురు సబ్-ఇన్‌స్పెక్టర్లు, మరో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారని, అయితే వారంతా ప్రమాదం నుంచి బయటపడ్డారని, గుంపు వాహనానికి నిప్పుపెట్టిందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందిని రంగంలోకి దించామని, ఘర్షణలో పాల్గొన్న వారందరినీ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.