Indian Army: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌తో మాత్రమే కాకుండా మొత్తం ముగ్గురు శత్రువలతో పోరాడామని మిలిటరీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(కాపబిలిటీ డెవలప్మెంట్ అండ్ సస్టెన్స్) లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ అన్నారు. ఇటీవల, పాకిస్తాన్‌తో జరిగిన ఉద్రిక్తత గురించి వివరణ ఇచ్చారు. ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్, పీఓకే లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. పాకిస్తాన్ ఆర్మీ కవ్వించడంతో పాక్ ఆర్మీ ఆస్తులపై భారత్ విరుచుకుపడింది.
ఇదిలా ఉంటే, ఈ సంఘర్షణలో భారత్, పాకిస్తాన్ తో పాటు చైనా, టర్కీతో పోరాడినట్లు వెల్లడించింది. నిజానికి పాకిస్తాన్ ముందు వరసలో ఉందని, చైనా అన్ని రకాల మద్దతు ఇచ్చిందని, చైనా తన ఆయుధాలు, ఇతర వ్యవస్థలను రియల్ టైమ్‌లో పరీక్షించేందుకు పాకిస్తాన్‌ను ప్రయోగశాలగా వాడినట్లు భారత సైన్యం చెప్పింది. DGMO స్థాయి చర్చలు జరుగుతున్నప్పుడు, పాకిస్తాన్ మన ముఖ్యమైన వెక్టర్‌ల గురించి చైనా నుంచి అప్‌డేట్ పొందిందని లెఫ్టినెంట్ జనరల్ చెప్పారు. మనకు బలమైన ఎయిర్ డిఫెస్స్ అవసరం అని ఆయన అన్నారు.
Read Also: Pawan Kalyan: నాకు ఇంటర్ సీట్ ఆయనే ఇప్పించారు.. ఆసక్తికర విషయం చెప్పిన పవన్!
పాకిస్తాన్ సైనిక హార్డ్‌వేర్‌లో అత్యధికంగా 81 శాతం చైనా మూలానికి చెందినది, చైనా తన సైనిక సాంకేతికతను పరీక్షించడానికి ఆ దేశాన్ని “లైవ్ ల్యాబ్”గా ఉపయోగిస్తుందని సైన్యం తెలిపింది. లెఫ్టినెంట్ జనరల్ సింగ్ ప్రకారం, చైనా-పాకిస్తాన్ రక్షణ సంబంధం సాంప్రదాయ ఆయుధ బదిలీలకు మించి అభివృద్ధి చెందింది, పాకిస్తాన్‌తో తన సన్నిహిత సంబంధాలను చైనా ప్రయోగాలకు అవకాశంగా పరిగణిస్తోందని, వాస్తవ ప్రపంచ సంఘర్షణ పరిస్థితుల్లో అధునాతన వేదికలు, నిఘా వ్యవస్థల్ని మోహరించడం వంటివి ఉన్నాయని చెప్పారు.
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) ప్రకారం, చైనా 2015 నుండి పాకిస్తాన్‌కు $8.2 బిలియన్ల విలువైన ఆయుధాలను విక్రయించింది. 2020 మరియు 2024 మధ్య, చైనా ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా నిలిచింది. ఈ ఎగుమతుల్లో దాదాపు మూడింట రెండు వంతులు లేదా 63 శాతం పాకిస్తాన్‌కు వెళ్లాయి. పాకిస్తాన్ ఫైటర్ ఫ్లీట్‌లో సగానికి పైగా చైనాతో కలిసి డెవలప్ చేసిన J-10C మల్టీరోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, JF-17 థండర్ విమానాలు ఉన్నాయి. ఇప్పుడు చైనా, పాకిస్తాన్ కు 40 షెన్యాంగ్ J-35 ఐదవ తరం స్టెల్త్ ఫైటర్‌లను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది.