NTV Telugu Site icon

Dil Movie: స్టూడెంట్ పవర్ చూపిన ‘దిల్’!

Dil

Dil

చిత్రసీమ చిత్రవిచిత్రమైనది. కొన్నిసార్లు అసలు పేర్లు మార్చేస్తుంది. కొసరు పేర్లు అతికిస్తుంది. ఇంటిపేర్లనూ కొత్తవి చేస్తుంది. తమకు పేరు సంపాదించిన చిత్రాలనే ఇంటిపేర్లుగా మార్చుకొని సాగిన వారెందరో ఉన్నారు. అలాంటి వారిలో నేడు నిర్మాతగా, పంపిణీదారునిగా చక్రం తిప్పుతోన్న’దిల్’రాజు అందరికీ బాగా గుర్తుంటారు. రాజు అసలు పేరు వెలమకుచ వెంకటరమణారెడ్డి. ఆ పేరు చిత్రసీమలో ఎవరికీ అంతగా తెలియదు. అంతకు ముందు పంపిణీదారునిగా, అనువాద చిత్ర నిర్మాతగా ఉన్న రాజు, ‘దిల్’ సినిమా విజయంతో ‘దిల్’రాజుగా మారిపోయారు. అంతలా అలరించిన ‘దిల్’ సినిమా ఏప్రిల్ 5తో ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. 2003 ఏప్రిల్ 4న విడుదల చేయాలని భావించారు. కానీ, సాంకేతిక కారణాల వల్ల ఓ రోజు ఆలస్యంగా ఏప్రిల్ 5న ‘దిల్’ జనం ముందు నిలచి వారి ‘దిల్’ గెలిచింది.

‘దిల్’లో ఏముంది? – ‘పవర్ ఆఫ్ స్టూడెంట్’ ఉంది. ఇంతకూ కథ ఏమిటంటే – తనకు ఎదురొచ్చిన వారిని అడ్డంగా నరుక్కుంటూ పోయే నరరూప రాక్షసుడు గౌరీశంకర్. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి శ్రీను. అతను చదివే కాలేజ్ లోనే గౌరీశంకర్ కూతురు నందిని కూడా చదువుతూఉంటుంది. వారిద్దరి మధ్య స్నేహం పెరిగి, అది ప్రేమగా మారుతుంది. గౌరీశంకర్ కూడా ఒకప్పుడు ప్రేమించి పెళ్ళి చేసుకున్నవాడే. కానీ, తన బిడ్డను ఎవరైనా తాకితే చాలు వాడి చేయి తీసేంత కర్కషుడు. అతని భార్య తండ్రి కూడా ఒకప్పుడు అలాంటివాడే. తన కూతురు శ్రీనును ప్రేమిస్తోందని తెలిసిన గౌరి తన మనుషులను పంపి, వారి అమ్మానాన్నకు వార్నింగ్ ఇప్పిస్తాడు. శ్రీను తల్లి అలాంటి వాడి అమ్మాయి వద్దని అంటుంది. కానీ, శ్రీను తండ్రి ప్రేమించడం తప్పేమీ కాదంటాడు. ప్రేమకోసం పోరాడమని కొడుకును ప్రోత్సహిస్తాడు. శ్రీను తన ఇంటికి వచ్చి గొడవచేసిన వారిని చితగ్గొడతాడు. గౌరీశంకర్ ఇంటికెళ్ళి నీ కూతుర్నే పెళ్ళి చేసుకుంటా అని సవాల్ విసరుతాడు శ్రీను. కూతురుకు వేరే సంబంధం చూస్తాడు. కానీ, శ్రీను వార్నింగ్ ఇస్తాడు. శ్రీనును లేపాయలని చూస్తాడు గౌరి. ఆసుపత్రి పాలవుతాడు శ్రీను. తన కూతురును భార్య తండ్రి ఇంట్లో ఉంచుతాడు గౌరి. మనవరాలు ప్రేమను తెలుసుకున్న తాత కూడా శ్రీనుకు మద్దతు ఇస్తాడు. ఈ లోగా శ్రీను కన్నవారిని వేసేయాలనుకుంటాడు గౌరి. కానీ, వారిని చూసిన వారందరూ శ్రీను చేత దెబ్బలు తిని ఆసుపత్రిలో ఉంటారు. మిగలినవారికి వారు ఎలా ఉంటారో తెలియదు. దాంతో శ్రీను తెలివిగా తన అమ్మానాన్నను నందిని వాళ్ళ అమ్మ సాయంతో వారింట్లోనే ఉంచుతాడు. వారిని చూసి, గౌరి ఎవరని అడిగితే, తమకు అన్నయ్య అవుతారని చెబుతుంది నందిని తల్లి. శ్రీను కన్నవారి కోసం ఊరంతా గాలించేలా చేస్తాడు గౌరి. చివరకు శ్రీను తన స్టూడెంట్స్ బలంతో వచ్చి, నందినిని అతని ఇంట్లోనే పెళ్ళాడతాడు. శ్రీను, నందినికి కొడుకు పుడతాడు. వాడిని చూస్తూ, ఇతరులకు ప్రేమపెళ్ళి చేయమని సలహా ఇస్తూ ఉంటాడు గౌరి.

ఇందులో నితిన్, నేహ, ప్రకాశ్ రాజ్, చలపతిరావు, సుధ, కల్పన, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, వేణుమాధవ్, అనంత్, దువ్వాసి మోహన్, సంగీత, రఘుబాబు, రాజన్ పి.దేవ్, రాళ్ళపల్లి, ఆహుతి ప్రసాద్, రఘు తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం సమకూర్చగా, చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, పెద్దాడమూర్తి, కులశేఖర్, వినరే కుమార్, టి.ఉమామహేశ్వరరావు పాటలు పలికించారు. ఇందులోని “పెద్దలొద్దంటున్నా…”, “ఎందుకో ఏమిటో…”, “తమలపాకు…”, “అమ్మాఆవు ఇల్లు ఈగ…”, “సీయమ్ పీయమ్ కావాలన్న…”, “ఒకనువ్వు ఒకనేను…”, “గాజులు గల్లుమన్నయే…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ చిత్రాన్ని రాజు- గిరి నిర్మించారు. శిరీష్-లక్ష్మణ్ సహనిర్మాతలు. చింతపల్లి రమణ మాటలు రాశారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వి.వి.వినాయక్ నిర్వహించారు.

ఈ సినిమా కంటే ముందు రాజు-గిరి మణిరత్నం ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’ తమిళ చిత్రాన్ని ‘అమృత’ పేరుతో అనువదించారు. అయితే ‘శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్’ పతాకంపై నిర్మితమైన తొలిచిత్రం ‘దిల్’. హీరో నితిన్ కు ఇది రెండవ చిత్రం. నాయిక నేహకు తొలి తెలుగు సినిమా. దర్శకుడు వినాయక్ కు ఇది మూడవ మూవీ. ఈ సినిమాకు నేడు ప్రముఖ దర్శకునిగా రాణిస్తున్న సుకుమార్ రచనా సహకారం అందించారు. ‘దిల్’ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి అంతకు ముందు మాధవన్ హీరోగా రూపొందిన ‘రన్’ సినిమా పోలికలు ఉన్నాయని అన్నారు. కానీ, ఈ సినిమానూ విశేషంగా ఆదరించారు జనం. ‘దిల్’ ఆధారంగా హిందీలో ‘ప్రేమ్ నంబర్ వన్’, తమిళంలో ‘కుత్తు’, కన్నడలో ‘స్టూడెంట్’, ఇండియన్ బెంగాలీలో ‘ఛాలెంజ్’, బంగ్లాదేశ్ బెంగాలీలో ‘భలో బాద్షా జిందాబాద్’ చిత్రాలు రూపొందాయి.

Show comments