NTV Telugu Site icon

Hari- Harish: వార్తల్లో చూసిన, చదివిన అంశాలతో ‘యశోద’ తీశాం

Hari Harish

Hari Harish

Hari- Harish:సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం పాన్ ఇండియా సినిమాగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శక ద్వయం హరి, హరీష్ మీడియాతో ముచ్చటించారు.

తమిళంలో ‘ఒరు ఇరవు’,’అంబులి’, ‘ఆ’, ‘జంబులింగం’ సినిమాలు చేశాం. అవి ఐడియాస్, మేకింగ్ పరంగా కొత్తగా ఉంటాయి. అవన్నీ ప్రయోగాలు కూడా. అయితే స్కేల్ పరంగా చూస్తే ‘యశోద’ పెద్ద సినిమా. మా తొలి సినిమా ‘ఒరు ఇరవు’లో హీరో హీరోయిన్లు ఉండరు. చూసే ప్రేక్షకులే హీరో. అది పాయింట్ ఆఫ్ మూవీ కావడంతో డిఫరెంట్ ఛాలెంజ్ ఫేస్ చేశాం. కథ పరంగా ఎప్పుడూ కొత్త పాయింట్ చెప్పాలనేది మా ఉద్దేశం. ఈ కథకు భారీ బడ్జెట్ అవసరం కూడా! మేము మూడు నాలుగు కోట్లలో తీయాలనుకుంటే.. బడ్జెట్ పెంచానని నిర్మాత చెప్పారు. ఆరంభంలో తక్కువ వ్యయంలో తీసేలా వెర్షన్ రెడీ చేశాం. స్క్రిప్ట్ రాసేటప్పుడు సమంతని దృష్టిలో పెట్టుకుని రాశాం. అయితే ఆవిడతో చేస్తామో? లేదో? తెలియదు. అందుకే తక్కువ బడ్జెట్‌లో చేసేలా రాసుకున్నాం. నిర్మాతకి చెప్పినప్పుడు భారీ స్థాయిలో ఎందుకు చేయకూడదు? ‘కంటెంట్ బావుంది. గ్లోబల్ రీచ్ ఉంటుంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా చేద్దాం’ అన్నారు. స్టార్ కాస్ట్ ఉన్నప్పుడు అలా చేయడం సాధ్యం అవుతుంది. సమంత గారిని కలిసిన తర్వాత భారీ స్కేల్‌లో చేయాలనుకున్నాం. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్‌లో ప్రేక్షకులకు కూడా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు సరోగసీపై ఎక్కువ చర్చ జరుగుతోంది. అయితే సరోగసీ మెయిన్ స్టోరీ కాదు. కథలో అదొక భాగమంతే! అందుకే, ఓపెన్‌గా చెప్పేశాం. సరోగసీ కంటే కథలో ఇంకా ఉంది. వార్తల్లో చూసిన, చదివిన విషయాల ఆధారంగా స్క్రిప్ట్ రాశాం. సినిమా చూసినప్పుడు షాక్ అవుతారు. ప్రపంచంలో మన చుట్టూ ఏం జరుగుతుందో, ఎవరికీ ఐడియా లేదు.

స్క్రిప్ట్ డెవలప్ చేసిన తర్వాత సస్పెన్స్ ఎలిమెంట్స్ యాడ్ చేశాం. ఆ తర్వాత స్క్రీన్ ప్లే మరింత ఆసక్తికరంగా మారింది. నెక్స్ట్ ఏం అవుతుంది? అనే టెన్షన్ ప్రేక్షకుల్లో ఉంటుంది. ఈ సినిమా తెలుగులో చేయడానికి కారణం మా ఫ్రెండ్, ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సెంథిల్ గారు. ఆయన తన స్వార్థం చూసుకోకుండా కథ గురించి ఆలోచించారు. కృష్ణప్రసాద్ గారు పాన్ ఇండియా స్థాయిలో భారీ తీద్దామని చెప్పడంతో అందుకు తగ్గట్టు కథ రెడీ చేసి సమంతకి చెప్పాం. ఇక షూటింగ్ లో ఆవిడ సహకారం మరవలేనిది. ఎంత పెద్ద ఎమోషనల్ సీన్ అయినా సరే రెండు నిమిషాల సమయం అడుగుతారు. గ్లిజరిన్ కూడా వాడరు. మేం ఏం కోరుకొన్నామో… అది ఈజీగా ఇచ్చేసేవారు. ‘మీకు ఓకేనా? వన్ మోర్ కావాలా?’ అని అడిగేవారు. సమంత హెల్త్ కండిషన్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగేటప్పుడు తెలిసింది. ఆవిడ వల్ల ఎప్పుడూ షూటింగ్ డిస్టర్బ్ కాలేదు. ఆవిడకు వర్క్ అంటే డెడికేషన్. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని కోరుకుంటారు.

ఇది మెడికల్ మాఫియా సినిమా అనుకోవచ్చు. సరోగసీ మీద చాలా సినిమాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌లో చాలా మంది పేద మహిళలు డబ్బుల కోసం తమ గర్భాన్ని సరొగసీకి ఇచ్చారు. ట్విన్స్ పుడితే వాళ్ళకు ఎక్కువ డబ్బులు వస్తాయి. దానికి కూడా వాళ్ళు ఓకే అనేవారు. సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ కోసం భారీ సెట్ వేసి ‘ఈవా’ అని ఆ సెంటర్‌కు పేరు పెట్టాం. ఆ పేరు ఎందుకు పెట్టామో సినిమా చూస్తే తెలుస్తుంది. పాన్ ఇండియా కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రజలు కనెక్ట్ అయ్యేలా ఉండాలనుకున్నాం. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్
కథకు ఏం కావాలో అది ఇవ్వడమే కాదు తెలుగు, తమిళ్ తెలిసిన వాళ్ళను ఎంపిక చేశారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. మణిశర్మ, మార్తాండ్ కె. వెంకటేష్, సుకుమార్… ప్రతి ఒక్కరూ వంద, రెండొందల సినిమాలు చేశారు. మాటల రచయితలు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి ఫ్లో ఈజీగా ఉండేలా చూసుకున్నారు. మా ఫీలింగ్ బాగా కన్వే చేశారు. మేం బౌండ్ స్క్రిప్ట్‌తో వాళ్ళను కలిశాం. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు కొన్ని యాడ్ చేశాం. వరలక్ష్మీ శరత్ కుమార్ ను కొత్తగా చూస్తారు. మొత్తం మీద ఎమోషన్‌తో కూడిన థ్రిల్లర్ ‘యశోద’ అని చెప్పవచ్చు. ప్రతి సన్నివేశంలో ఎమోషన్ ఉండాలని చెప్పే రాజమౌళి గారు మాకు స్ఫూర్తి. ఈ సినిమా తర్వాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో మరో సినిమా చేస్తున్నాం.