తమిళ హీరోయిన్, బిగ్ బాస్ ఫేమ్ యషిక ఆనంద్ కొద్దిరోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. యషిక తన స్నేహితులతో కలసి పాండిచ్చేరిలో పార్టీ ముగించుకుని చెన్నైకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యషిక స్నేహితురాలు పావని మృతి చెందింది. యషికాతో పాటు మరో ఇద్దరు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. కాగా యషిక ఆనంద్ తీవ్ర గాయాలకు గురైంది.
చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యషిక ఆనంద్ ను ప్రస్తుతం డిశ్చార్జ్ చేశారు. సహజంగా డిశ్చార్జ్ కాగానే ఎవరైనా ఇంటికి వెళతారు. కానీ యషిక మాత్రం ఓ నర్సు ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళితే తన స్నేహితురాలు పావని జ్ఞాపకాలే గుర్తుకు వస్తాయని.. అందువల్లే నర్సుగా పనిచేస్తున్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లినట్లు యషిక తెలిపింది.
రీసెంట్‌గా యషిక తన సోషల్ మీడియాలో భవాని మృతిని తలచుకొని బాధపడింది. నేను కూడా చనిపోయుంటే బాగుండేది, ఇప్పుడు బతికున్నా కూడా సంతోషంగా లేనంటూ ఎమోషనల్ అయింది. భవాని.. నువ్వు జీవితంలో నన్ను క్షమించవని తెలుసు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పావని కుటుంబ సభ్యులని క్షమాపణ కూడా కోరింది.
ప్రస్తుతం యషిక కోలుకోవడంతో పోలీసులు పని మొదలుపెట్టారు. యషికపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యషిక డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే ఆమెను ఎంక్వైరీకి పిలవనున్నట్లు తెలుస్తోంది. తమిళ నటి అయిన యషిక తెలుగులో విజయ్ దేవరకొండ ‘నోటా’ సినిమాలో ఓ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
