Yash: కేవలం రూ.300 జేబులో పెట్టుకుని బెంగళూరులో సినిమా కలల కోసం అడుగుపెట్టిన ఓ సాధారణ యువకుడు.. నేడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్. ఒకప్పుడు బస్సు డ్రైవర్ కుమారుడిగా సాధారణ జీవితాన్ని చూసిన యష్.. ఇప్పుడు రాకీ భాయ్‌గా భారతీయ సినిమా ప్రేక్షకుల ఊహల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఈ స్థాయికి ఆయన ప్రయాణం ఒక్క సినిమాతోనో, ఒక్క విజయంతోనో సాధ్యపడలేదు. దాదాపు 22 ఏళ్ల కెరీర్‌లో ఆయన తీసుకున్న వరుస రిస్కులే ఈ స్టార్‌డమ్‌కు అసలు పునాది వేశాయి.
యష్ తల్లిదండ్రులైన అరుణ్ కుమార్, పుష్ప దంపతులు అత్యంత సాధారణ మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చినవారు కాగా, వీరికి 1986 జనవరి 8న కర్ణాటకలోని హాసన్ జిల్లాలో యష్ (నవీన్ కుమార్ గౌడ) జన్మించారు. తండ్రి అరుణ్ కుమార్ బెంగళూరు ప్రభుత్వ రవాణా సంస్థలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించగా, తల్లి పుష్ప గృహిణిగా ఉంటూనే కుటుంబ ఆర్థిక అవసరాల కోసం చిన్న కిరాణా దుకాణాన్ని నడిపారు. తన కుమారుడు దేశం గర్వించే ‘రాకీ భాయ్’గా, పాన్-ఇండియా సూపర్ స్టార్‌గా ఎదిగినప్పటికీ, అరుణ్ కుమార్ ఎంతో నిరాడంబరంగా ఉంటూ తన డ్రైవర్ వృత్తిని కొనసాగించడం విశేషం.
ఇక యష్‌కు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో బెంగళూరుకు వచ్చినప్పుడు ఆయన దగ్గర పెద్దగా డబ్బు కూడా లేదు. కేవలం రూ.300 జేబులో పెట్టుకుని ఆత్మవిశ్వాసంతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చిన్న చిన్న పనులు చేస్తూ, మొదట బుల్లి తెరలో నటిస్తూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 2004లో ‘సిల్లీ లల్లి’ వంటి టీవీ షోలతో ప్రేక్షకులకు పరిచయమైన ఆయన, ఆ తర్వాత కన్నడ సినిమాల్లోకి అడుగుపెట్టారు. ప్రారంభంలో రొమాంటిక్ హీరోగా, లవర్ బాయ్ ఇమేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
‘మొగ్గిన మనసు’, ‘గూగ్లీ’ వంటి సినిమాలు యష్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఆయనలోని చాక్లెట్ హీరో ఇమేజ్ కన్నడ యువతలో మంచి క్రేజ్‌ను సంపాదించింది. అయితే అక్కడే ఆగిపోవడం యష్‌కు ఇష్టం లేదు. తనకు వచ్చిన ఇమేజ్‌ను పదే పదే మార్చుకోవడానికి ప్రయత్నించడం ఆయన కెరీర్‌లో మొదటి నుంచే కనిపించింది.
అసలు సంచలనం మాత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’తో మొదలైంది. 2018లో విడుదలైన ఈ సినిమా యష్‌ను ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పరిచయం చేసింది. రాకీ భాయ్ పాత్రలో ఆయన చూపించిన యాక్షన్, స్వాగ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో యష్ కేవలం కన్నడ స్టార్‌గా కాకుండా దేశంలోని పాన్ ఇండియా హీరోలలో ఒకరిగా మారిపోయారు.
ఇక్కడే యష్ మరో కీలకమైన రిస్క్ తీసుకున్నారు. ‘కేజీఎఫ్’ వంటి భారీ ఫ్రాంచైజీ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తన మార్కెట్‌ను వెంటనే క్యాష్ చేసుకునే అవకాశం ఆయనకు ఉంది. కానీ అలా చేయకుండా నాలుగేళ్ల పాటు విరామం తీసుకున్నారు. తనపై ఏర్పడిన రాకీ భాయ్ ఇమేజ్‌ను అలాగే కొనసాగించకుండా, పూర్తిగా భిన్నమైన ప్రపంచంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఆ నిర్ణయమే ‘టాక్సిక్’కు దారితీసింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ డార్క్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో యష్ ‘రాయా’ పాత్రలో కనిపించనున్నారు. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణీ వసంత్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. యష్ లుక్, పాత్ర స్వభావం, యాక్షన్ ఎలిమెంట్స్ చూస్తే రాకీ భాయ్‌కు పూర్తి భిన్నమైన అవతారాన్ని చూపించేందుకు ఆయన ప్రయత్నించిన విషయం స్పష్టమవుతోంది. రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ స్పందన చూస్తే ఆయన క్రేజ్ ఏమిటో తెలుస్తోంది.
అయితే యష్ ప్రయోగాలు ‘టాక్సిక్’తో ముగియడం లేదు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ‘రామాయణం’లో ఆయన రావణుడి పాత్రను పోషిస్తున్నారు. రాకీ భాయ్‌గా మాస్ ఇమేజ్ సంపాదించిన నటుడు.. ఇప్పుడు రాయా అనే డార్క్ గ్యాంగ్‌స్టర్‌గా, ఆ తర్వాత రావణుడిగా కనిపించబోతుండటం ఆయన కెరీర్‌లో ఎంత పెద్ద మార్పో అర్థమవుతోంది.
యష్ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన స్టార్‌డమ్‌ను కేవలం విజయవంతమైన సినిమాలు నిర్మించలేదు. ప్రతి విజయం తరువాత మరో రిస్క్ తీసుకునే ధైర్యమే ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది. రొమాంటిక్ హీరో నుంచి రాకీ భాయ్‌గా మారడం ఒక ప్రయోగమైతే, రాకీ భాయ్ తర్వాత నాలుగేళ్లు వేచి ఉండి ‘టాక్సిక్’ను ఎంచుకోవడం మరో పెద్ద నిర్ణయం. ఇప్పుడు రావణుడిగా కనిపించేందుకు సిద్ధమవడం మరో సాహసం.
అందుకే యష్ కథను ఒక సాధారణ సినీ విజయగాథగా చూడలేం. రూ.300తో బెంగళూరులో అడుగుపెట్టిన యువకుడి నుంచి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఈ ప్రయాణంలో ప్రతి మలుపు వెనుక ఒక రిస్క్ ఉంది. రాకీ భాయ్‌తో సామ్రాజ్యాన్ని నిర్మించిన యష్.. రేపు రిలీజ్ అవుతున్న టాక్సిక్’తో ఆ సామ్రాజ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్తారా, రావణుడిగా తన నటనా సామర్థ్యాన్ని మరోసారి నిరూపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

