NTV Telugu Site icon

K. Ramalakshmi: కవి ఆరుద్ర సతీమణి కన్నుమూత

K Ramalakshmi

K Ramalakshmi

K. Ramalakshmi: ముక్కుసూటిగా మాట్లాడటానికి ఎంతో ధైర్యం కావాలి. కేవలం ధైర్యం ఉంటే సరిపోదు. ఆ మాట్లాడిన దానిని సమర్థించుకొనే తెగువా ఉండాలి. ఆ సమర్థనకు తగ్గ శాస్త్రీయత కూడా ఎంతో అవసరం. ఇవన్నీ పుష్కలంగా ఉన్న రచయిత్రి కె.రామలక్ష్మి. ప్రఖ్యాత విమర్శకులు, గీతరచయిత, కవి ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మి. భర్తకు దీటుగా రామలక్ష్మి సైతం ఎన్నో విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. ఆమె కలం నుండి జాలువారిన పలు కథల్లో స్త్రీవాదం పరిమళించేది. ఆరుద్ర, రామలక్ష్మి దంపతులు తెలుగు సాహితీరంగానికి ఎనలేని సేవ చేశారనే చెప్పాలి. అంతకు ముందు ఆరుద్ర రాసిన సాహిత్యానికి 1954లో రామలక్ష్మితో వివాహమైన తరువాత ఆరుద్ర పలికించిన పాండిత్యానికి తేడా ఉందంటారు. ఎందుకంటే, ఆయన రచనలకు మొదటి విమర్శకురాలు రామలక్ష్మియే! అంతటి విమర్శకురాలి మెప్పు పొందిన తరువాతే ఆరుద్ర పాట కానీ, పదం కానీ, చివరకు చరిత్ర పరిశోధన కానీ లోకం ముందు నిలిచాయని చెప్పాలి. అందుకే ఈ నాటికీ ఆరుద్ర సాహిత్యం జనం మదిని గెలుస్తూనే ఉందనీ చెప్పొచ్చు. అలా ఆరుద్ర జీవితనాయికగా వెలిగిన కె.రామలక్ష్మి మార్చి 3న హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు.

NTR: అంత అవమానించినా ఆ నందమూరి కుటుంబంలో ఎలా బతుకుతున్నావు అన్నా..

రామలక్ష్మి 1930 డిసెంబర్ 31వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కోట నందూరులో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో బి.ఏ.పట్టా పుచ్చుకున్నారు. మాతృభాష తెలుగులోనే కాకుండా ఆంగ్లంలోనూ ఆమెకు ఎంతో పట్టుండేది. 1951 నుండీ రచనల చేయడం మొదలు పెట్టారు. 1954లో వెలుగు చూసిన రామలక్ష్మి రచన ‘విడదీసే రైలుబళ్ళు’ మంచి పేరు సంపాదించి పెట్టింది. ఆ తరువాత ఆమె కలం నుండి “మెరుపు తీగె, అవతలిగట్టు, తొణికిన స్వర్గం, ప్రేమించుప్రేమకై, ఆంధ్రనాయకుడు,పండరంగని ప్రతిజ్ఞ” వంటివి వెలుగు చూశాయి. ఆరుద్ర, రామలక్ష్మి దంపతులు ఎప్పుడూ సాహిత్యపరమైన చర్చలతోనే సాగేవారని ప్రతీతి. ఇద్దరూ తరచూ తమ అభిప్రాయాలతో విభేదించుకుంటూ పోట్లాడుకొనేవారనీ సన్నిహితులు చెబుతారు. అయితే పరస్పరం గౌరవించుకుంటూ సంసారనౌకను నడిపారు. వారికి ముగ్గురు కుమార్తెలు. అందరికీ సాహిత్యంలో ప్రవేశముంది. ఆ కారణంగా ఆరుద్ర తాను రాసే సినిమా పాటల గురించి, కథల విషయమై ముందుగా భార్యాబిడ్డలతోనే చర్చించేవారు.

Manchu Manoj: భార్య మొదటి పెళ్లికి గెస్ట్ గా వెళ్లిన ఏకైక హీరో నువ్వే భయ్యా..

ఆరుద్ర రాసిన సినిమా పాటలే కాదు, చారిత్రక పరిశోధనల్లోనూ రామలక్ష్మి సహాయసహకారాలు ఉన్నాయి. ఆరుద్ర మదిలో ‘అరుణ’ పతాకం రెపరెపలాడుతున్నా, పురాణకథలకు సంభాషణలు సమకూర్చడంలోనూ, పాటలు రాయడంలోనూ తనకు తానే సాటి అనిపించారు. అందుకు కారణం రామలక్ష్మి అనే అంటారు. కృష్ణ సొంత నిర్మాణ సంస్థ నిలిచేలా చేసిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రం తెలుగులో తొలి కౌబోయ్ మూవీ. ఈ చిత్రానికి కథను సమకూర్చింది ఆరుద్రనే. భార్యాభర్తలిద్దరికీ ఆంగ్లసాహిత్యంతోనూ ప్రపంచ సినిమాతోనూ మంచి పరిచయం ఉండేది. ఆ కారణంగానే కొన్ని వెస్ట్రన్ మూవీస్ ను కలిపి, ‘మోసగాళ్ళకు మోసగాడు’ కథను తయారు చేశారు. ఆ సినిమా ఘనవిజయం సాధించడమే కాదు, కృష్ణ, ఆయన సోదరులు భవిష్యత్ లో పలు అద్భుతాలు చేయడానికి కారణమయింది. అందువల్ల కృష్ణ, ఆయన సోదరులకు కూడా ఆరుద్ర, రామలక్ష్మి దంపతులంటే ఎంతో గౌరవం ఉండేది. ఆ రోజుల్లో కారు మెయింటెయిన్ చేయడమంటే అంత సులువు కాదు. అందువల్ల ఆరుద్ర కుటుంబం ఎక్కడికి వెళ్ళాలన్నా, పద్మాలయా సంస్థనే వారికి ప్రయాణ ఏర్పాట్లు చేసేది. ఇక కృష్ణ సతీమణి విజయనిర్మల దర్శకత్వంలో రూపొందిన ‘మీనా’కు, తరువాత ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవదాసు’ సమయంలోనూ ఆరుద్ర రచనాపరంగానే కాకుండా, ఓ కుటుంబంలోని వ్యక్తిగా తమకు సహకరించారని కృష్ణ దంపతులు చెప్పేవారు. యన్టీఆర్, ఏయన్నార్ సంస్థలతోనూ ఆరుద్రకు ఎంతో అనుబంధం ఉండేది. స్టార్ డమ్ కు తగ్గట్టుగా పాటలు రాసే పద్ధతిని ఆరుద్రయే తెలుగునాట ప్రవేశ పెట్టారని చెప్పాలి. అలాగే అన్యభాషలను అనువుగా తెలుగు పాటల్లో చొప్పించడమూ ఆరుద్ర బాణీ! వీటన్నిటి వెనకాల రామలక్ష్మి హస్తం కూడా ఉందని చెప్పేవారు. భర్త ఆరుద్ర ‘ఆంధ్ర సమగ్ర సాహిత్యం’కు అంకితమైన రోజుల్లో ఆయనకు రామలక్ష్మి చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆ తరువాత ఆ చారిత్రక పరిశోధన వెలుగు చూడటానికి కూడా రామలక్ష్మి కృషి చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా తెలుగు అకాడమీ ద్వారా ‘ఆంధ్ర సమగ్ర సాహిత్యం’ వెలుగు చూసింది.

Organic Mama Hybrid Alludu Movie Review : ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు!

కె.రామలక్ష్మి సెన్సార్ బోర్డ్ మెంబర్ గానూ పనిచేశారు. 1979లో దాసరి నారాయణరావు రూపొందించిన యువచిత్ర వారి ‘గోరింటాకు’ చిత్రానికి కథ కె.రామలక్ష్మి అన్న టైటిల్ కార్డ్ వేశారు. నిజానికి ఆ కథను రంగనాయకమ్మ రాశారు. కానీ, ఆ కథ బాగుందని నిర్మాతకు చెప్పడంతో వారు రామలక్ష్మిదే కథ అని భావించి, అలా వేశామని తరువాత వివరణ ఇచ్చుకున్నారు. కానీ, కోర్టుకు ఎక్కిన రంగనాయకమ్మ వైపే న్యాయం నిలచింది. నిర్మాత అపరాధ సుంకం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆరుద్ర మరణం తరువాత రామలక్ష్మి ఆ నాటి జ్ఞాపకాలతో సాగారు. ఈ నేపథ్యంలో ఆమె ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలు వివాదాస్పదంగానూ మారాయి. యన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు వంటి వారిజీవితాల్లోని విషయాలపైనా రామలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. ఆ విషయాల్లో అన్నీనిజాలు కాకపోయినా, ఆమె ముక్కుసూటి మాట అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా చేశాయి. ఏది ఏమైనా విలక్షణమైన వ్యక్తిత్వంతో సాగిన కె.రామలక్ష్మి తెలుగు సాహితీవనంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారనే చెప్పాలి.